Bhadrachala Sri Rama Kalyanam Mahotsavam: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి గోటితో ఒలిచిన నాలుగు క్వింటాళ్ల తలంబ్రాలను ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, నెల్లూరు, కనిగిరి జిల్లాల నుంచి.. తెలంగాణలోని కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వచ్చిన భక్త బృందాలు స్వామివారికి సమర్పించారు. 11 ఏళ్లుగా ఈ వరి విత్తనాలను భద్రాద్రిలో పూజలు చేయించి తూర్పు గోదావరిలోని కోరుకొండలో ప్రత్యేకంగా పంట పండిస్తున్నారు.
ఈ వడ్లను వేలాది మంది భక్తుల చేత ఒలిపించి రామయ్య సన్నిధికి అప్పగిస్తున్నారు. 12వ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో ఒలిచిన తలంబ్రాలను రామయ్య సన్నిధికి అందించారు. ప్రతి ఏడాది సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు అందించడం సంతోషంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి 30 లక్షల విలువ గల ముత్యాల వస్త్రాలను నెల్లూరుకు చెందిన భక్తులు సమర్పించారు. ప్రతి సోమవారం ప్రధాన ఆలయంలోని మూలవరులకు, ఉపాలయంలోని లక్ష్మీ తాయారు అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి ముత్తంగి అలంకరణ ఉంటుంది. ప్రత్యేకంగా తయారు చేసిన ముత్యాల వస్త్రాలతో అలంకరించిన స్వామి వారిని ముత్తంగి అలంకారం అంటారు.