రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పల్లె ప్రగతి నాలుగో విడత కార్యక్రమం ఈ రోజు ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం గుండాలలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం, మిషన్ భగీరథ, ఇతర విభాగాల పనితీరుకు సంబంధించి అధికారులను మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పరిధిలో ఖాళీ స్థలాల పరిశుభ్రత కోసం సంబంధిత వర్గాలకు నోటీసులు అందజేయాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. నోటీసులు ఉల్లంఘించిన వారిని తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లి చౌక దుకాణాల ద్వారా ఇచ్చే సరుకులను కొంతకాలం నిలిపివేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై జరిమానా విధించాలని సూచించారు. ఖాళీ స్థలాలను అపరిశుభ్రంగా ఉంచకుండా ఆయా స్థలాల్లో మొక్కలు నాటి స్వచ్ఛతను పెంపొందించాలని సూచించారు.
మూడు రోజుల్లోగా
వైకుంఠధామాలకు మిషన్ భగీరథ నీరు అందించకపోవడంపై సంబంధిత అధికారిపై ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిపై వివరాలు తెలుసుకున్నారు. మూడు రోజుల్లో మండలంలో అన్ని ప్రాంతాలకు ఇంటింటికీ మంచి నీటి కనెక్షన్లు పూర్తి చేస్తామని అధికారులు చెప్పడంతో.. 3 రోజుల్లో పనులు కాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని.. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులతో సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పాఠశాల అభివృద్ధికి మంత్రి పువ్వాడతో కలిసి సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటులో కాకుండా.. ప్రభుత్వ బడుల్లోనే చదివిస్తామని హామీ ఇవ్వాలని కోరడంతో స్థానికులు మద్దతు తెలిపారు.
చిన్న మొక్కలు నాటొద్దు