తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు పైనుంచి వరద నీరు.. రెండు గ్రామాలకు రాకపోకలు బంద్

వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా చాలచోట్ల గ్రామల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వరద ఉద్ధృతికి ఇల్లందు, సత్యనారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

flooding-over-the-bridge-dot-stopped-traffic
రెండు గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు

By

Published : Sep 4, 2021, 1:44 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఇల్లందులపాడు చెరువు అలుగు ఉద్ధృతంగా పోస్తోంది. దీంతో ఇల్లందు - సత్యనారాయణపురం మార్గం మధ్యలో ఉన్న వంతెనపై నుండి నీరు ప్రవహిస్తోంది. దీంతో సత్యనారాయణపురం - ఇల్లందు పట్టణానికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఇల్లందులోని మూడవ వార్డులో వర్షపు నీరు చేరడంతో 50 కుటుంబాల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇల్లందుకు రాకపోకలు సాగించే చేపల వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు ఎక్కడివారు అక్కడే ఉండటం వల్ల వ్యాపారం లేక ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరదల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. నీరు ప్రవహించేలా పూడిక తీశారు.. కానీ వంతెన ఎత్తు నిర్మాణంపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. ఉద్ధృతంగా అలుగు పోస్తున్న ప్రతిసారీ ఈ పరిస్థితి ఎదురవుతోందని సత్యనారాయణపురం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీగా ఉన్న సత్యనారాయణపురం.. ఇల్లందు పట్టణంలో విలీనమైనప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని అధికారులు పట్టించుకోవటం లేదని అసహనం వ్యక్తం చేశారు.

చెరువు అలుగు పోస్తున్నప్పుడు విద్యుత్ దీపాల కాంతులతో వేడుకలు నిర్వహించిన పురపాలక సంఘం, ప్రజాప్రతినిధులు ఆ నీటితో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై స్పందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

AGENCY PROBLEMS: సరుకులు కొనాలంటే.. ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details