గుక్కెడు పాలు దొరక్క పసివాళ్లు అల్లాడుతున్నారు. కారం అన్నం గొంతు దిగక గుక్కపట్టి ఏడుస్తున్నారు. ఆరు రోజులుగా కుటుంబాలన్నీ పాడికి దూరమయ్యాయి. ఆ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంది. కొన్నిచోట్ల ఉడికీ ఉడకని అన్నం, కిచిడీ పెడుతుండటంతో విరేచనాల బారిన పడుతున్నారు. వరద బాధితులకు భద్రాద్రి జిల్లా బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో దుస్థితి ఇది. వరద తగ్గిన చోట ఇళ్లకు వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటంతో బాధితులు కుదేలవుతున్నారు.
బూర్గంపాడు మండలంలో ఇరవెండి, మోతె, సారపాక, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, బూర్గంపాడు, సంజీవ్‌రెడ్డిపాలెం గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దాదాపు 11 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారికి వేర్వేరు చోట్ల ఎనిమిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అశ్వాపురం మండలంలో బట్టీలగుంపు, అమ్మగారిపల్లి, అమీరుద్ద, చింతిర్యాల, ఆనందపురం, మల్లెలమడుగు, నెల్లిపాక, రామచంద్రాపురం, కుమ్మరిగూడెం గ్రామాలకు మొత్తం ఆరు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించారు. అక్కడ 1200 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు.
ఆహారం అంతంతమాత్రం:బాధితులకు ఆహారం అందించే బాధ్యతను రెవెన్యూ తదితర శాఖల సిబ్బందితో ఏర్పాటు చేసిన బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. బియ్యం తదితర సామగ్రి సమకూర్చి ప్రతి కేంద్రంలో వంట చేయిస్తున్నారు. మధ్యాహ్న భోజనంగా కిచిడీ, అన్నం-పప్పు మాత్రమే పెడుతున్నారు. ఒక్కోరోజు పప్పు బదులు ఆలుగడ్డ లేదా టమాటా కూర వడ్డిస్తున్నారు. సాంబారు, మజ్జిగ లాంటివి లేనేలేవు.
ఉడికీ ఉడకని అన్నం పెడుతుండటంతో అజీర్తి సమస్య ఏర్పడుతోంది. కిచిడీ కూడా తినలేకపోతున్నామని కొందరు పేర్కొంటున్నారు. ఒక్కోపూట అన్నం పెట్టడం ఆలస్యమవుతుండడంతో చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారని తల్లులు వాపోతున్నారు. భద్రాద్రి జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో దాదాపు 2 వేల మంది పిల్లలున్నట్లు అంచనా. వీరికి పాలు, పౌష్టికాహారం అందడంలేదు. దాతలు అప్పుడప్పుడు ఇస్తున్న బిస్కెట్లను దాచి చిన్నారులకు తినిపిస్తున్నారు.
ముసురుతున్న వ్యాధులు:పునరావాస కేంద్రాలన్నీ ఫంక్షన్‌హాళ్లు, పాఠశాలల భవనాలు కావడంతో ఈదురుగాలి నేరుగా తాకుతోంది. ముసురు పడుతుండటంతో వృద్ధులు, చిన్నారులు వణికిపోతున్నారు. జలుబు, ఒళ్లు నొప్పులతో అవస్థ పడుతున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేదు. భరించలేనంత దుర్వాసన, దోమల బాధతో అల్లాడుతున్నామని బాధితులు చెబుతున్నారు. బూర్గంపాడు మండలం వీఎం బంజర ప్రభుత్వ పాఠశాల పునరావాస కేంద్రంలోని ఓ గదిలో 15 మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు.
అందులోనే ఒకమూల విరిగిపోయిన బల్లలు, కుర్చీలు, పాతబస్తాలు ఉన్నాయి. గది అంతా చెత్తతో నిండిపోయి ఉంది. బాధితులు విధిలేక చెత్త, దోమల మధ్య అవస్థలు పడుతున్నారు. వీఎం బంజరలోని మూడు కేంద్రాల్లో అపరిశుభ్రత ఎక్కువగా ఉంది. ఓ ప్రైవేటు పాఠశాలలో గదులు బాగున్నా.. ఆవరణంతా రొచ్చుగా మారింది. బాధితుల్లో ఎక్కువ శాతం ట్యాంకర్ల నీటినే తాగుతున్నారు. అప్పుడప్పుడు అధికారులు నీటి పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. వీఎం బంజర పీహెచ్‌సీ పరిధిలోని కేంద్రాల్లో దాదాపు వంద మంది విరోచనాలతో బాధపడుతుంటే చికిత్స అందించినట్లు వైద్యసిబ్బంది తెలిపారు.