సింగరేణి పుట్టినిల్లయిన ఇల్లందులో సంస్థ నిర్మిస్తున్న 39 మెగావాట్ల సోలార్ ప్లాంటులో 15 మెగావాట్ల విభాగాన్ని సింగరేణి డైరెక్టర్లు శనివారం ప్రారంభించారు. తెలంగాణ ట్రాన్స్ కో అధికారుల సమక్షంలో సింక్రనైజేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. దీనిపై సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం ప్రకటిస్తూ అధికారులకు అభినందనలు తెలిపారు. మొదటి దశలో రెండు ఏరియాల్లో మిగిలి ఉన్న 59 మెగావాట్ల ప్లాంటు విభాగాలను కూడా ఈ నెలాఖరుకల్లా పూర్తిచేసి విద్యుత్‌ను అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈరోజు సింక్రనైజేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డైరెక్టర్లు ఎన్.బలరామ్, డి.సత్యనారాయణరావులు స్విచ్ ఆన్ చేసి సింగరేణి సోలార్ విద్యుత్తును 132 కేవీ టీఎస్ ట్రాన్స్‌కో విద్యుత్ కేంద్రానికి అనుసంధానం చేశారు. సీఎండీ ఎన్.శ్రీధర్ సారథ్యంలో సింగరేణి వ్యాప్తంగా 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు నెలకొల్పుతున్నామనీ, ఈ ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పాదన జరుగనుందని తెలిపారు. సింగరేణి సంస్థ సుస్థిర భవిష్యత్తు కోసం, వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న వీటి నిర్మాణం వల్ల కంపెనీకి ఏటా రూ.120 కోట్ల వరకు ఆదా చేకూరనుందని వెల్లడించారు.
ఇల్లందు ఏరియాలో 230 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ 39 మెగావాట్ల సోలార్ ప్లాంటులో ఇప్పటికే 15 మెగావాట్ల విభాగం నుంచి విద్యుత్తు ఉత్పాదన ప్రారంభమైంది. ఈరోజు దీనిని ట్రాన్స్‌కోకు అనుసంధానం చేశారు. ఈ నెలాఖరుకల్లా మిగిలిన 24 మెగావాట్ల నిర్మాణం కూడా పూర్తయి విద్యుత్తు ఉత్పాదన ప్రారంభించనుంది.
మొదటిదశ ప్లాంటుల్లో ఇప్పటికే 70 మెగావాట్ల అనుసంధానం
సింగరేణి సంస్థ నిర్మించనున్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంటుల్లో మొదటి దశలో 4 ఏరియాల్లో 129 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో మణుగూరులోని 30 మెగావాట్ల ప్లాంటు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 10 మెగావాట్ల ప్లాంటు ఇప్పటికే పూర్తి స్థాయిలో విద్యుత్తు ఉత్పాదన ప్రారంభించాయి. రామగుండంలోని 50 మెగావాట్ల ప్లాంటులో 15 మెగావాట్ల విభాగం, ఇల్లందులోని 39 మెగావాట్ల ప్లాంటులో 15 మెగావాట్ల విభాగాలు కూడా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో మొత్తం 70 మెగావాట్ల సింగరేణి సోలార్ విద్యుత్ ట్రాన్స్‌కో గ్రిడ్‌కు అనుసంధానం అయింది. నిర్మాణం చివరి దశలో ఉన్న 59 మెగావాట్ల నిర్మాణం పనులను కూడా వేగంగా పూర్తిచేసి వచ్చెనెల 20వ తేదీ లోపు గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని అధికారులు కృషి చేస్తున్నారు.