పత్తి సాగు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో ఈ ఏడాది కూడా తెలంగాణలో ఈ పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సాధారణం కన్నా(42 లక్షల ఎకరాలు) 25 శాతం అదనంగా సాగైంది. ఈ నెల 5వతేదీ నాటికే 55.17 లక్షల ఎకరాల సాగుతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. దేశంలో అత్యధికంగా పత్తి సాగుచేసిన రాష్ట్రాలలో తెలంగాణ వరసగా రెండో ఏడాది రెండో(మొదటి స్థానం మహారాష్ట్ర) స్థానంలో నిలిచినట్టు కేంద్ర వ్యవసాయశాఖ తాజా నివేదికలో తెలిపింది. గతేడాది వానా కాలంలో 60.22 లక్షల ఎకరాల్లో సాగైన నేపథ్యంలో ఇప్పుడూ అదే స్థాయికి చేరవచ్చని వ్యవసాయశాఖ తాజా అంచనా.
దిగుబడులే అసలు సమస్య
పత్తి సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరుగుతున్నా... దిగుబడులు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. గతేడాది 60.22 లక్షల ఎకరాల్లో సాగైనందున, 55 లక్షల టన్నుల దూది దిగుబడి వస్తుందని తెలంగాణ మార్కెటింగ్ శాఖ తొలుత అంచనా వేసింది. చివరికి మార్కెట్లకు వచ్చింది 24.23 లక్షల టన్నులే కావడం గమనార్హం. ఇందులో ‘భారత పత్తి సంస్థ (సీసీఐ)’ నేరుగా 17.73 లక్షల టన్నులు, ప్రైవేటు వ్యాపారులు 6.50 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. గతేడాది సీసీఐ క్వింటా ఒక్కింటికి రూ.5,825కు కొనుగోలు చేసింది. ఈ ఏడాది అక్టోబరు నుంచి మార్కెట్లకు రైతులు తెచ్చే కొత్త పత్తి పంటకు క్వింటాకు రూ. 6,025 చొప్పున ఇవ్వాలని కేంద్రం ప్రకటించింది. వాస్తవానికి రాష్ట్రంలో క్వింటా పత్తి పండించాలంటే పెట్టుబడి వ్యయం రూ.9 వేలు దాటుతోందని వ్యవసాయశాఖ ‘భారత వ్యయ, ధరల కమిషన్’ (సీఏసీపీ)కి తెలిపింది. దీన్నిబట్టి ఎకరానికి కనీసం 10 క్వింటాళ్ల దిగుబడి రాకపోతే నష్టాలే మిగులుతాయని రైతులు చెబుతున్నారు.
గత ఏడాది వచ్చింది సగమే..
గతేడాది అక్టోబరు నుంచి డిసెంబరు దాకా మార్కెట్లకు వచ్చిన పత్తిలో తేమ ఎక్కువగా ఉందన్న కారణాన్ని చూపి వ్యాపారులు మద్దతు ధర చెల్లించలేదు. సీసీఐ కూడా తేమ శాతం ఆధారంగానే ధర చెల్లించింది. మద్దతు ధర అందరికీ ఇస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా సాగైన పత్తి పంట తాలూకూ పెట్టుబడి వ్యయం రూ. 24,088 కోట్లకుగానూ.. రూ.14,114 కోట్లే రైతులకు అందింది. ఈ ఏడాది డీజిల్, పురుగుమందుల ధరలన్నీ పెరగడంతో ఎకరా పెట్టుబడి వ్యయం రూ. 50 వేలు దాటుతోంది. కౌలుతో కలిపితే వ్యయం రూ. 60 వేలకు పైగా ఉంటోందని, పంట దిగుబడి కనీసం 10 క్వింటాళ్లయినా రాకపోతే సాగుదారులకు నష్టాలు తప్పవని వ్యవసాయ శాఖ వర్గాలే చెబుతున్నాయి.