కార్మిక వ్యతిరేక సంస్కరణలతో నిర్వీర్యం అవుతున్న సింగరేణి (Singareni) సంస్థను కార్మికోద్యమాలతోనే జీవం పోసి పూర్వవైభవం తీసుకురావాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు (Ex Mla Nageshwara rao) అన్నారు. సింగరేణి సంస్థను పరిరక్షించాలని, ప్రభుత్వ ఆర్థిక దోపిడీని నివారించాలన్నారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Ex Mla Kunamneni Samba Shivarao)నేతృత్వంలో రెండు రోజులు చేపట్టనున్న నిరవధిక నిరాహారదీక్ష (Hunger Strike)ను పువ్వాడ ప్రారంభించారు.
కూనంనేనికి పూలమాల వేసి దీక్షలను ప్రారంభించిన అనంతరం కార్మికులను ఉద్దేశించి పువ్వాడ మాట్లాడారు. బీఐఎస్ఆర్ ముప్పు నుంచి సింగరేణిని కాపాడిన చరిత్ర ఏఐటీయూసీ, సింగరేణి కార్మికులదన్నారు. పన్నులు, సీఎస్ఆర్ నిధుల పేరుతో ప్రభుత్వం అప్పనంగా దోచేస్తోందని విమర్శించారు. గడిచిన ఆరేళ్లలో కేవలం రాయల్టీ పేరుతోనే రూ.9.255 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దోచేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దోపిడీని అడ్డుకుంటేనే సంస్థకు మనుగడ ఉంటుందని పేర్కొన్నారు.