దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా లక్ష్మీ తాయారుగా అమ్మవారు వీరలక్ష్మి అలంకారంలో కనిపించడంతో భక్తులు పరవశించిపోయారు. లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఐశ్వర్య లక్ష్మీ కొలువుదీరగా సామూహికంగా కుంకుమార్చనలు చేశారు. లక్ష్మీ అంటే శాసనపరమైన శక్తి సామర్థ్యాలు అని అర్థం. అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు శాసకురాలు అమ్మ. కరుణా రూపిణి అయిన ఈ అమ్మవారి క్రీగంటి చూపుల కదలికలనే శాసనాలుగా భావించి శ్రీ మహా విష్ణువు సకల జగద్రక్షణ చేస్తుంటాడని వైదిక పెద్దలు ప్రవచించారు. రామాయణ పారాయణం భక్తిప్రపత్తులను పెంచగా సంక్షిప్త రామాయణ హోమం పరమానందాన్ని పంచింది. రేపు మహాలక్ష్మి అలంకారంలో అభయప్రదానం చేయనున్నారు.
నిత్య కల్యాణోత్సవం
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆంజనేయస్వామికి భక్తిశ్రద్ధలతో అభిషేకం నిర్వహించి అర్చన చేశారు. అంజన్న భక్తులు సిందూరం నుదుట ధరించి జైశ్రీరామ్ జైహనుమాన్ అంటూ ప్రదక్షిణ చేశారు. ప్రధాన ఆలయంలో కొలువైన కోదండ రాముడికి అర్చకులు సుప్రభాతం పలికి నామార్చన పఠించారు. క్షేత్ర విశిష్టతను వైదిక పెద్దలు ప్రవచించడంతో భక్తులు ఆనందంలో తేలియాడారు. పునర్దర్శనానికి వచ్చే భాగ్యం కల్పించాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడ్ని వేడుకున్నారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేనుల వారిని ఆరాధించి పుణ్యాహ వాచనం కొనసాగించారు. గోత్రనామాలను చదివి సీతాదేవికి యోక్త్రధారణ రామయ్యకు యజ్ఞోపవీత ధారణ చేశారు. మాంగళ్యధారణ తన్మయత్వంలో ముంచెత్తగా తలంబ్రాల వేడుక పరమానందం కలిగించింది. దర్బారు సేవలో హరిదాసులు ఆలపించిన కీర్తనలు ఆధ్యాత్మికతను నింపాయి.
ఇదీ చూడండి:నెట్ లేకున్నా డిజిటల్ చెల్లింపులు.. త్వరలో దేశవ్యాప్తంగా..