Dh Srinivasrao Strange worship: ప్రజా వైద్యారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు విచిత్రమైన హోమ కార్యక్రమంలో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత అంజనాపురం పంచాయతీ జిమ్నా తండాలో మంగళవారం రాత్రి తెరాస ఎంపీపీ విజయలక్ష్మి నిర్వహించిన హోమంలో డీహెచ్ పాల్గొన్నారు. రాత్రి సమయంలో నిర్వహించిన ప్రత్యేక హోమ పూజల్లో డీహెచ్... తలపాగా ధరించి, హోమం చుట్టూ తిరుగుతూ పూజలు నిర్వహించారు. తెరాస ఎంపీపీగా ఉన్న విజయలక్ష్మి ప్రతి మంగళవారం తన ఇంటి ఆవరణలోనే గిరిజన సంప్రదాయానికి చెందిన వివిధ రకాల పూజలు నిర్వహిస్తుండటం ఆనవాయితీ.
ఇందులో భాగంగా ఈనెల 24న పాల్వంచలో తన ట్రస్టు పేరిట మెగా వైద్య శిబిరం నిర్వహించాలని నిర్ణయించిన డీహెచ్ శ్రీనివాసరావు... మంగళవారం సన్నాహక ఏర్పాట్ల కోసం కొత్తగూడెం వచ్చారు. ఇందులో భాగంగా ఎంపీపీ విజయలక్ష్మి ఆహ్వానం మేరకు మంగళవారం రాత్రి హోమంలో పాల్గొన్నారు. అయితే... ఈ హోమం కార్యక్రమం మిరపకాయలతో నిర్వహించడం, ఆ వీడియోలు వైరల్గా మారడం చర్చనీయాంశంగా మారింది. దీంతో నిర్వహకులు ఈ హోమ పూజలపై వివరణ ఇచ్చారు. కులదేవతను పూజిస్తూ... గిరిజన సంప్రదాయంలో సాగే హోమంగా పేర్కొంటున్నారు.
డీహెచ్ స్పందన:తాను ఎలాంటి క్షుద్ర పూజల్లో పాల్గొన లేదని డీహెచ్ శ్రీనివాస రావు వివరణ ఇచ్చారు. విచిత్ర హోమంలో పాల్గొన్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న తనపై కొందరు కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యంగిరాదేవి పూజలో పాల్గొంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. స్థానికులు గిరిజన పూజ ఉందన్న ఆహ్వానంతో కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో పూజలో పాల్గొనట్టు వివరించారు.