DH Srinivas Rao on contesting from Kothagudem :మూడోసారి అధికారపగ్గాలు చేపట్టి.. హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. కొన్ని స్థానాల్లో మార్పులు-చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో కొత్త వారికి కూడా అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్(డీహెచ్) డా.గడల శ్రీనివాసరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.
DH Srinivas Rao on Contesting in Assembly Elections 2023 : ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్న డీహెచ్ శ్రీనివాస్‌రావు.. మరోసారి ప్రచారంలోకెక్కారు. వచ్చే ఎన్నికల్లోసీఎం కేసీఆర్ అవకాశమిస్తే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అన్నారు. శనివారం రోజున కొత్తగూడెం శ్రీనగర్ కాలనీలోని ‘జనహితం’ కార్యాలయంలో పాల్గొన్న ఆయన.. విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తాను పుట్టిన కొత్తగూడెం ప్రాంతంలో జీఎస్ఆర్ ట్రస్టు నెలకొల్పి విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్వతంత్రంగా లేదా ఇతర పార్టీల తరఫున పోటీ చేసే ఆలోచన తనకి లేదని వివరించారు.
DH Srinivas Rao Latest Comments :ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ కొత్తగూడెం నుంచి ఎంతోమంది హైదరాబాద్, సుదూర ప్రాంతాలకు తరలివెళ్తున్నారన్న ఆయన.. ఈ నేపథ్యంలో 'కొత్త కొత్తగూడెం' నిర్మాణమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. వాటి గురించి నియోజకవర్గ ప్రజలకు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. కొత్తగూడెం సర్వజన ఆసుపత్రిలో రూ.2 కోట్లతో ట్రామా కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు.