నీలి మేఘశ్యాముడు భద్రాద్రి రాముడు కొలువై ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఓ భక్తుడు తన భక్తి భావాన్ని చాటుకున్నాడు. దేవునిపై ఉన్న భక్తితో తనకు తెలిసిన కళా నైపుణ్యంతో హంస వాహనాలు తయారుచేస్తున్నాడు. ప్రతియేటా శ్రీ సీతారామచంద్ర స్వామికి ముక్కోటి ఏకాదశి ముందు రోజు గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆ ఉత్సవానికి ప్రత్యేకంగా లాంచీని తీసుకువచ్చి హంస వాహనంగా తయారుచేస్తారు. రాముడిని అందులో కూర్చుండబెట్టి విహరింప జేస్తారు.
హంస వాహనాన్ని తయారుచేశాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన పాలమని రామకృష్ణ గతంలో పెయింటింగ్ కళాకారునిగా పనిచేశాడు. ప్రస్తుతం పెయింటింగ్‌కు ఆదరణ లేకపోవడం వల్ల చిన్న ద్విచక్రవాహనంపై చరవాణి కవర్లను అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రామునిపై ఉన్న భక్తితో గోదావరి నదిలో ఎలాగైతే హంస వాహనంపై స్వామి వారు విహరిస్తారో, అదే విధంగా ఇతను ధర్మకోల్ షీట్లతో హంస వాహనాన్ని తయారుచేశాడు. భద్రాద్రిలో ఈ నెల 5న గోదావరి నదిలో తెప్పోత్సవం జరగనుంది. ఇతను కూడా బ్రిడ్జి సెంటర్లో తన చరవాణి దుకాణం పక్కన చిన్న నీటి కుంటను ఏర్పాటు చేసి అందులో హంస వాహనాన్ని నడుపు తానని చెబుతున్నాడు.