తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి రామయ్య సన్నిధికి చేరిన కోటి తలంబ్రాలు

వేయి పున్నముల శోభను కళ్లెదుట సాక్షాత్కరింపచేసే భద్రాద్రి రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. శ్రీరామనవమిని పురస్కరించుకుని... భద్రాద్రిలో జరిగే స్వామివారి కల్యాణ క్రతువు తలంబ్రాలు ఇప్పటికే భద్రాద్రికి చేరుకున్నాయి. జగత్ కళ్యాణంగా అభివర్ణించే ఈ మహత్తర కార్యక్రమంలో గోటితో వలిసిన తలంబ్రాలకు ప్రత్యేక విశిష్టత ఉంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం స్వామివారికి సమర్పించే తలంబ్రాలను ప్రత్యేకంగా తయారుచేసి, అందజేసింది.

Devotees presenting one croreTalambaralu for the Sitarama kalyanam in Bhadrachalam
భద్రాద్రి రామయ్య సన్నిధికి చేరిన కోటి తలంబ్రాలు

By

Published : Apr 19, 2021, 5:06 AM IST

జానకి దోసిట కెంపుల త్రోవై... రాముని దోసిట నీలపు రాసై... ఆణిముత్యములే తలంబ్రాలుగా... అంటూ జగదభిరాముడి కల్యాణఘట్టాన్ని వర్ణించే భద్రాచలం తలంబ్రాలు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. సీతమ్మవారి మెడలో రామయ్య మంగళసూత్రం కట్టే అపురూప క్షణాల్లో ఈ తలంబ్రాల ప్రత్యేకతను చెబుతుంటారు. రోజూ జరిగే నిత్యకళ్యాణంలో వాడే తలంబ్రాలు పసుపురంగులో ఉంటాయి. కానీ, ఏడాదికొకరోజు జరిగే తిరుకళ్యాణ వేడుకలో ఉపయోగించే తలంబ్రాలు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి. రాములోరి చేతిలో నీలపు రాసులుగా... సీతమ్మ చేతిలో పగడపు వర్ణముగా కనిపించే ఈ తలంబ్రాలకు వాడే వడ్లను చేతితో ఒలిచి... ఆ బియ్యాన్ని భద్రాద్రి రామయ్యకు సమర్పిస్తారు.

ప్రత్యేకంగా పండించి...

అనాది కాలం నుంచి సీతారాముల కల్యాణ వేడుకకు భక్తులు గోటితో ఒలిచిన తలంబ్రాలను సమర్పిస్తున్నారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం స్వామివారికి సమర్పించే తలంబ్రాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. వాటి కోసం ప్రత్యేకంగా వరి పంట పండించి... వడ్లను రెండు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు పంపుతారు. వాటిని ఒలిచి బియ్యంలో పసుపు, కుంకుమ, అత్తరు, నెయ్యి, గులాం, ముత్యాలు కలిపి ఎరుపు రంగు తలంబ్రాలుగా తయారు చేసి కల్యాణంలో ఉపయోగిస్తారు.

భక్తుల నమ్మకం...

కల్యాణంలో ఉపయోగించిన అక్షతలను ధరిస్తే భార్యాభర్తల బంధం ఒడుదొడుకులు లేకుండా సాగుతూ... అన్యోన్యతకు మారుపేరుగా నిలుస్తుందని భక్తుల నమ్మకం. సీతారాముల కల్యాణం కోసం ఈ ఏడాది దాదాపు 70 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఇందులో వందకిలోల ముత్యాలను ఉపయోగిస్తుండగా... ఇప్పటికీ లక్షవరకు ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేశారు.

గరుడ ధ్వజ పట ఆవిష్కరణ...

భద్రాచలంలో శ్రీ రామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడ ధ్వజ పట ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ముందుగా గరుడ పటాన్ని జీయర్ మఠం నుంచి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. సోమవారం ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠ , భేరీ తాండవం, దేవత ఆహ్వానం, బలి సమర్పణ, హనుమత్ వాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

భక్తులు లేకుండానే...

ఏటా సుమారు 500 మంది భక్తులు కాలి నడకన వచ్చి స్వామివారిని దర్శించుకుని కోటి తలంబ్రాలను సమర్పించేవారు. కానీ ఈ సారి కరోనా నిబంధనల కారణంగా కేవలం 15 మంది మాత్రమే వచ్చి తలంబ్రాలను ఆలయ అధికారులకు అప్పగించారు. ఈ నెల 21న జరగనున్న సీతారాముల కల్యాణం, 22న జరగనున్న పట్టాభిషేక మహోత్సవాన్ని భక్తులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సోమవారం నుంచి ఈ నెల 31 వరకు అంతరాలయంలోని పూజలు నిలిపివేసి... కేవలం సర్వదర్శనం, శీఘ్ర దర్శనాలు మాత్రమే ఉన్నాయన్నారు.

ఇదీ చదవండి: భద్రాద్రి రామయ్య కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలు

ABOUT THE AUTHOR

...view details