తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి ముక్కోటి ఉత్సవాలపై భక్తుల అసంతృప్తి - vaikunta ekadasi in bhadradri

దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి పుణ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలంటే భక్తజనానికి ఎనలేని మక్కువ. ప్రతి ఏటా భక్తుల జయజయధ్వానాలు, జానకిరాముల నామస్మరణల మధ్య ఎంతో వైభవోపేతంగా జరిగే ఉత్సవాలు కరోనాతో ఈ ఏడాది నిరాడంబరంగా జరిగాయి. ఆంక్షలు పాటించైనా.. రామయ్య దర్శన భాగ్యం దక్కకపోతుందా అన్న ఆశతో ఆలయానికి పోటెత్తిన భక్తులు.. అధికారుల సమన్వయలోపంతో ఉత్తర ద్వారం ద్వారా రఘునందనుణ్ని చూడకుండానే వెనుతిరగాల్సి వచ్చింది. శ్రీరాముని దర్శనం కేవలం వీవీఐపీలు, పోలీసులకే అన్నట్లుగా సాగిన ఉత్సవంపై భక్తజనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

bhadradri vaikunta ekadasi celebrations 2020
భద్రాద్రి ముక్కోటి ఉత్సవాలపై భక్తుల అసంతృప్తి

By

Published : Dec 25, 2020, 3:58 PM IST

Updated : Dec 25, 2020, 5:38 PM IST

భద్రాద్రి పుణ్యక్షేత్రంలో ఈ ఏడు జరిగిన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు విమర్శలకు దారితీశాయి. కరోనా ప్రభావంతో సాదాసీదాగా సాగడం ఒక ఎత్తైతే.. కొవిడ్ ఆంక్షలతో ఆలయ అధికార యంత్రాంగం చేతులెత్తిన తీరు మరో ఎత్తు. కరోనా ప్రభావంతో ముక్కోటిలో ప్రధాన ఘట్టాలైన తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం భక్తుల సందడి లేకుండానే నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కేవలం వైదిక పెద్దలు, పరిమిత సంఖ్యలో ముఖ్యుల సమక్షంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఎవరికీ అనుమతి లేదు

గురువారం సాయంత్రం జరిగిన తెప్పోత్సవం భక్తులు లేకుండానే జరగ్గా.. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం అలాగే నిర్వహించాలనుకుని ఎలాంటి పాసులు జారీ చేయలేదు. మిథిలా ప్రాంగణంలోకి ఎవరికీ అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు.

ఇష్టానుసారం

ఉత్తర ద్వార దర్శనం నిర్వహించిన మిథిలా ప్రాంగణానికి కొంతమంది వైదిక పెద్దలు, ప్రముఖులకు మాత్రమే అనుమతిచ్చినా.. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన పాసులతో వీవీఐపీలు, వీఐపీలు, పోలీసుల కుటుంబ సభ్యులతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఎక్కడా కరోనా నిబంధనలు పాటించలేదు. ఆలయ అధికారులు, రెవెన్యూ అధికారుల సమన్వయలోపంతో కార్యక్రమమంతా ఎవరి ఇష్టానుసారం వారిది అన్నట్లుగా సాగింది.

వాళ్లేనా భక్తులు

ఓ వైపు కరోనా ఆంక్షలున్నా రాములవారి దర్శన భాగ్యం దక్కకపోతుందా అన్న ఒకే ఒక్క ఆశతో భద్రాద్రి వచ్చిన భక్తులకు తీవ్ర నిరాశ తప్పలేదు. ఉత్తర ద్వారం ద్వారా రాములోరి దర్శనం కోసం ఎముకలు కొరికే చలిలో రాత్రి నుంచే నిరీక్షించిన సామాన్య భక్తులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. ప్రాంగణం ఎదుట వందలాది మంది భక్తులు దాదాపు 4 గంటల పాటు నిరీక్షించినా వారికి అనుమతి ఇవ్వలేదు. ఈ తతంగమంతా చూసిన భక్తజనం అధికారుల తీరుపై మండిపడ్డారు. దేవుడు దర్శనం ప్రముఖులకేనా...సామాన్యులకు లేదా అంటూ నిలదీశారు.

ఎమ్మెల్యేకు తప్పలేదు

సామాన్య భక్తులే కాదు.. సాక్షాత్తు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు చేదు అనుభవం తప్పలేదు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకే కనీసం ప్రొటోకాల్ పాటించలేదు. వేకువజామునే మిథిలా ప్రాంగణానికి ఎమ్మెల్యే వచ్చినా పట్టించుకున్న వారే కరవయ్యారు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే వీరయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విమర్శల జల్లు

మొత్తంగా భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనం వేళ జరిగిన ఏర్పాట్లు, అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా సాకుతో భక్తులకు ప్రవేశం ఇవ్వకుండా లక్షల ఆదాయం పోగొట్టడమే కాకుండా.. ఉత్సవమంతా ప్రముఖుల సేవలో సాగిందంటూ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Dec 25, 2020, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details