కదలని కలెక్టరేట్లు.. నాలుగేళ్లయినా నత్తనడకే! Khammam Collectorate Construction Works : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలు నాలుగేళ్లవుతున్నా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. 2017లోనే కలెక్టరేట్ల నిర్మాణాలకు బీజం పడినా... భూసేకరణ సమస్యలతో పనులు ఆలస్యమయ్యాయి. ఖమ్మం-వైరా ప్రధాన రహదారి వి.వెంకటాయపాలెంలో 20 ఎకరాల్లో ఖమ్మం కలెక్టరేట్ నిర్మాణం 2018లో ప్రారంభమైంది. రూ.35 కోట్ల నిధులతో జీ ప్లస్ టూతో 4 బ్లాకులుగా 2020 జనవరి నాటికి పూర్తికావాలని నిర్దేశించుకున్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా... ఇంకా కొలిక్కి రాలేదు. గుత్తేదారులు సబ్ కాంట్రాక్టుకు ఇవ్వడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయనే విమర్శ ఉంది.
ఖమ్మం పట్టణానికి కూతవేటు దూరంలో వెంకటాయపాలెం విలేజ్ దగ్గర నూతన కలెక్టరేట్ నిర్మాణం జరుగుతోంది. జూన్, జులై ఆఖరకు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. కలెక్టరేట్ పూర్తయ్యే లోపు.. రోడ్డు విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. ఖమ్మం కలెక్టరేట్ ఫైనల్ స్లాబ్, బ్రిక్ వర్క్ జరుగుతోంది. యాభై శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి.
-పువ్వాడ అజయ్, రవాణాశాఖ మంత్రి
మార్చి చివరినాటికి..!
కొత్తగూడెం-పాల్వంచ పట్టణాల మధ్య భద్రాద్రి నూతన కలెక్టరేట్ నిర్మాణానికి 2018 ఏప్రిల్ 3న శుంకస్థాపన చేశారు. 25 ఎకరాల్లో రూ.44 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటివరకు దాదాపు 70 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే భవనం తుది రూపుదాల్చుకుంది. అధికారుల ఛాంబర్లు, డ్రైనేజీలు, విద్యుత్ పనులు కొలిక్కి వచ్చాయి. ఫ్లోరింగ్, పెయింటింగ్, అంతర్గత రోడ్లు, పెయింటింగ్ పనులు చేయాల్సి ఉంది. గుత్తేదారుకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల కొంతకాలం పనులు నిలిచిపోయాయి. మార్చి చివరి నాటికి ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెబుతున్నారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కలెక్టరేట్ల నిర్మాణం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాది కొత్త కలెక్టరేట్ కాబట్టి... బ్రహ్మాండంగా నిర్మిస్తున్నాం. మార్చి చివరకల్లా అది పూర్తవుతుంది. వెంటనే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తాం. కొత్తగూడెం కలెక్టరేట్ నిర్మాణం దాదాపు 75 శాతం పూర్తయింది. సివిల్ వర్క్ పూర్తయింది. ఫర్నీచర్ పనులు కొనసాగుతున్నాయి.
-పువ్వాడ అజయ్, రవాణాశాఖ మంత్రి
ఇదీ చదవండి:Tummala Nageshwararao Comments: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర కామెంట్స్