మావోయిస్టు అగ్రనేత, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ (డీకేఎస్‌జెడ్‌సీఎం) వినోద్ హేమ్లా అలియస్ ఇమ్లా (55) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన వినోద్ కరోనా సోకి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అతనిపై రూ. 8 లక్షల రివార్డు ఉంది. 2013లో అక్కడ కాంగ్రెస్ అగ్ర నాయకులపై జరిగిన దాడి సహా 16 కీలక దాడులకు అతడు నేతృత్వం వహించాడు. అప్పటి కాంగ్రెస్ చీఫ్ నందకుమార్ పటేల్, ప్రతిపక్ష నేత మహేంద్ర కర్మ, కేంద్ర మాజీమంత్రి విద్యాచరణ్ శుక్ల సహా 29 మంది మృత్యువాతపడిన దాడి వినోద్ ఆధ్వర్యంలోనే జరిగింది.
గత రెండు నెలల కాలంలో 20 మంది వరకు మావోయిస్టు అగ్రనేతలు, సభ్యులు కరోనాతో మృత్యువాతపడ్డారని ఛత్తీస్‌గఢ్ బస్తర్‌రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పేర్కొన్నట్లు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం నుంచి పరిహారంతో పాటు మెరుగైన వైద్యం అందిస్తామని భద్రాద్రి ఎస్పీ పేర్కొన్నారు.