Maoist's letter: భద్రాచలం జిల్లాలో వైద్యులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు హెచ్చరించారు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం ఇప్పుడు మెడికల్ మాఫియాకు కాసులు కురిపిస్తోందనీ, పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పనిచేస్తున్నాయని ఆరోపిస్తూ ఓ లేఖ విడుదల చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని బూచిగా చూపి వారిని భయభ్రాంతులకు గురిచేసి రోగుల రక్తం పిండుకుంటున్నారనీ, ఛత్తీస్ఘడ్, ఒడిశా, ఆంధ్ర ప్రాంత గిరిజనులు, గిరిజనేతరులతో పాటు స్థానిక తెలంగాణ ప్రాంత ప్రజలను వైద్యం పేరుతో రోజుల తరబడి ఆసుపత్రుల్లో ఉంచి అవసరం లేకున్నా రకరకాల పరీక్షలు చేస్తూ ల్యాబులు, ఆసుపత్రులు, వైద్యులు.. ప్రజలను డబ్బుల కోసం హింసిస్తున్నారని రాశారు.
ప్రజల ప్రాణాలు ఇప్పడు ఆసుపత్రులకు డబ్బులు కురిపించే అవకాశాలుగా మారాయని, ప్రజల నమ్మకానికి తూట్లు పొడుస్తూ కొందరు వైద్యులు రాక్షసుల్లా తయారై.. రోగుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారనీ మండిపడ్డారు. ఆరోగ్య సమస్యలను అలుసుగా చేసుకుని.. మనిషిలో రకరకాల పరీక్షల పేర్లతో భయాన్ని సృష్టిస్తూ ఆసుపత్రి గల్లలను కొల్లలుగా నింపుకుంటున్నారనీ, ప్రైవేటు ఆసుపత్రి మొదలుకొని ప్రభుత్వ ఆసుపత్రి వరకు కాసుల కక్కుర్తి మరిగిన వైద్యులు జనాలను పీడించుకుతింటున్నారనీ అన్నారు.