పట్టుకోసం మావోయిస్టులు..వారి అణిచివేత కోసం పోలీసులు ఎవరికి వారే చేస్తున్న ప్రయత్నాలతో అడవిలో అలజడి చెలరేగుతున్న వేళ..భద్రాద్రి అడవుల్లో మరోసారి తూటా పేలింది. భద్రాద్రి జిల్లాలో బుధవారం రెండు చోట్ల పోలీసులు-మావోయిస్టుల మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పాల్వంచ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకోగా.. చర్ల అటవీప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. చెన్నాపురం అటవీప్రాంతంలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
పేలుళ్లకు ఉపయోగించే సామగ్రి స్వాధీనం
కాల్పులు జరిగిన ప్రదేశంలో ఒక 8 ఎంఎం రైఫిల్, పేలుళ్లకు ఉపయోగించే సామాగ్రి ఒక కిట్ బ్యాగుతోపాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రకటించారు. ఎదురుకాల్పుల నుంచి మరికొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు వెల్లడించారు. అంతకుముందు మధ్యాహ్నం సమయంలో జిల్లాలోని పాల్వంచ అటవీప్రాంతంలోనూ మావోయిస్టులు- జిల్లా పోలీస్ పార్టీల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఒక ఎస్బీబీఎల్ తుపాకి, కిట్ బ్యాగులు, సోలార్ ప్లేట్లు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఒక్కనెలలోనే ఆరుగురు..
జిల్లాలో జూలై 15న మొదలైన ఎదురుకాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. తొలుత జరిగిన మణుగూరు మల్లెతోగు అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకోగా... దాదాపు నెలన్నర రోజులకే గుండాల అటవీ ప్రాంతంలో తూటా పేలింది. సెప్టెంబర్ 3న జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందగా.. మరొకరు పరారయ్యారు. సెప్టెంబరు 7న చర్ల మండలం పూసుగుప్ప అటవీప్రాంతంలో ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. అంతేకాదు... ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు.