తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తుల సందడి లేని భద్రాద్రి రామయ్య ఆలయం - Bhadrachalam SriRam Temple

కరోనా ప్రభావం భద్రాద్రి రామయ్య ఆలయంపై తీవ్రంగా పడింది. అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా సాగాయి. భక్తులతో కిటకిటలాడే ఆలయం జనాలు లేక వెలవెలబోయింది. పచ్చని తోరణాలతో కళకళలాడే ఆలయం తోరణాలు లేకుండా కనిపిస్తోంది.

భద్రాచలం సీతారాముల ఆలయం
భద్రాచలం సీతారాముల ఆలయం

By

Published : Apr 7, 2020, 6:35 AM IST

గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రాద్రి దివ్యక్షేత్రం భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది. భక్త రామదాసు ఆలయం నిర్మించినప్పటి నుంచి పూజల్లో, అలంకారాల్లో, ఉత్సవాల్లో ఎలాంటి లోటు రాలేదు. ఈసారి మాత్రం కరోనా వైరస్ ప్రభావం వల్ల స్వామివారికి ఘనంగా జరగాల్సిన కార్యక్రమాలు నామమాత్రంగా జరిగాయి.

అలంకరణలు లేకుండా ఉత్సవాలు

సీతారాములు వనవాస కాలంలో రెండున్నరేళ్ల పాటు భద్రాద్రి ప్రాంతంలో గడపడం ఇక్కడి పుణ్యక్షేత్రం గొప్పదనం. భద్రాద్రిలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో ముఖ్య ఘట్టాలైన ఎదుర్కోలు, సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం వేడుకలకు మాత్రమే మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించి... పుష్పాలతో పూజలు చేశారు. మిగతా ఉత్సవాలన్నీ ఎలాంటి అలంకరణలు లేకుండా జరిపిస్తున్నారు.

మిగిలిపోనున్న ముత్యాల తలంబ్రాలు

రాములోరి కల్యాణం చూసేందుకు వచ్చే భక్తులకు ఇచ్చేందుకు రూ. 10 లక్షలతో కొన్న ముత్యాలు, క్వింటాళ్ల కొద్ది అక్షతలు అలానే మిగిలిపోయాయి. అయితే ముత్యాల తలంబ్రాలను ఆన్​లైన్​ ద్వారా ఇంటికి పంపే ఏర్పాటు చేశారు. అయినప్పటికీ భారీగా ముత్యాల తలంబ్రాలు మిగిలిపోనున్నాయి.

సవాల్​గా మారిన సిబ్బంది జీతాలు

భద్రాద్రి రామయ్యకు భక్తులు ఇచ్చే విరాళాల ద్వారానే ఆదాయం వస్తుంది. వాటినే సిబ్బందికి జీతాలుగా అందించాల్సి ఉంది. ఈ ఏడాది కరోనా ప్రభావంతో భక్తులు రాలేదు. ఈసారి జీతాల చెల్లింపులు ఆలయ అధికారులకు సవాలుగా మారింది.

భక్తుల సందడి లేని భద్రాద్రి రామయ్య ఆలయం

ఇవీచూడండి:'దేశంలో కరోనా కేసులు, మృతుల్లో పురుషులే అధికం'

ABOUT THE AUTHOR

...view details