లాక్‌డౌన్ ప్రభావం సింగరేణిపైనా పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు ఏరియాల్లో ఏప్రిల్‌లో 60 శాతం మించి ఉత్పత్తి జరగలేదు. రానున్న వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి, ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ఏప్రిల్, మే నెలలు సింగరేణికి ఎంతో ముఖ్యం. ఈ రెండు నెలల్లో అనుకున్న దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేసి నిల్వ చేస్తుంది. ప్రస్తుతం భిన్న పరిస్థితి నెలకొంది. భూగర్భ గనుల్లో లేఆఫ్ ప్రకటించటం ఉత్పత్తి తగ్గుదలకు మరో కారణంగా చెప్పొచ్ఛు
జిల్లాలో 9 ఉపరితల గనులు, 4 భూగర్భ గనులు ఉన్నాయి. మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం ఏరియాల నుంచి వివిధ రకాల పరిశ్రమలకు బొగ్గు రవాణా అవుతుంది. కొవిడ్-19తో విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు మినహా, మిగిలిన పరిశ్రమలు కొనసాగటం లేదు. డిమాండ్ లేక ఉత్పత్తి అయిన బొగ్గులో సగం మాత్రమే రవాణా అవుతోంది. మిగిలింది డంప్ యార్డుల్లో నిల్వ చేశారు. రైలు మార్గం ద్వారా రోజుకి 6-8 ర్యాకుల బొగ్గు రవాణా జరగాలి. కానీ 3-4 ర్యాకుల బొగ్గు మాత్రమే రవాణా అవుతుంది. బీటీపీఎస్‌లో బొగ్గు నిల్వ చేసేందుకు అవకాశం లేక ఈ నెల 21 నుంచి రవాణా నిలిచింది. ఇప్పటివరకు బీటీపీఎస్‌కు 43,770 టన్నుల రవాణా జరిగింది.