బోసిపోయిన భద్రాద్రి..నిర్మూనుష్యంగా రామయ్య ఆలయం భద్రాచలం పుణ్యక్షేత్రం ప్రపంచంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచింది. ఇక్కడ జరిగే శ్రీరామనవమి వేడుకలు అత్యంత విశేషమైనవి. కరోనా ప్రభావం వల్ల ఈసారి నవమి వేడుకలు నిరాడంబరంగా జరగనున్నాయి.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 20 శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్ర ప్రభుత్వం భక్తుల దర్శనాలను నిలిపివేసింది. తిరిగి ఆదేశాలు ఇచ్చే వరకు భక్తులకు అనుమతిలేదని ఆలయ ఈవో నరసింహులు తెలిపారు.
ఏప్రిల్ 2న జరిగే సీతారాముల కల్యాణాన్ని జన సందోహం నడుమ కాకుండా ఆలయ అర్చకులు, వేదపండితుల మధ్య మాత్రమే జరపాలని నిర్ణయించింది. భక్తులు లేక క్యూలైన్లను నిర్మానుష్యంగా మారాయి. కల్యాణ మండపంలోని పనులు, లడ్డు తయారీ పనులు ఆపివేశారు.
ప్రపంచానికి దడ పుట్టిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రభుత్వం నిర్దేశించిన సూచనలు పాటిస్తూ వాటిని అమలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులు సీతారాముల కల్యాణం చూసి తరించాలని ఆలయ వైదిక పెద్దలు తెలిపారు.