Bhadradri Rama Pattabhishekam: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా పూజలు అందుకుంటున్న భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం చేయడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 31న జరిగే ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకమైనదిగా ఆలయ అర్చకులు అంటున్నారు. స్వామివారికి ప్రతి నిత్యం రామాయణ పారాయణ జరుగుతూ ప్రతి పుష్యమి నాడు పట్టాభిషేకం నిర్వహిస్తున్నప్పటికి.. ఈసారి 60 సంవత్సరాల తరువాత ప్రభవ నామ సంవత్సరంలో శ్రీరాములవారికి మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు వేదపండితులు చెబుతున్నారు.
వందల ఏళ్లుగా క్రమంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఈసారి చాలా ప్రత్యేకమైనదిగా అర్చకులు అంటున్నారు. జీవితకాలంలో దానిని దర్శించలేని వారి కోసం 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర పట్టాభిషేకంగా విడదీసి అదే సంప్రదాయంలో జరుపుతున్నారు. ఈనెల 31న జరగబోయేది రెండో పుష్కర మహా సామ్రాజ్య పట్టాభిషేకం. దీని కోసం దేశంలోని నదులు, సముద్రాల నుంచి పవిత్ర జలాలను సేకరిస్తున్నారు.
మంత్ర సహితంగా ఈ పవిత్ర జలాలను తీసుకుని రావటానికి ఇప్పటికే ఆలయ అర్చకులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి పుణ్య జలాలను సేకరిస్తున్నారు. పశ్చిమ దిక్కు తీర్థ సేకరణ విధిలో గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా నగరంలో పశ్చిమ సముద్ర తీర్థం స్వీకరించారు. దక్షిణం వైపు తమిళనాడులోని వానమామలై దివ్యదేశము దేవనాయగన్ పెరుమాళ్ సన్నిధి పుష్కరిణి తీర్థం స్వీకరించారు.
అదే రాష్ట్రంలోని ఆళ్వార్ తిరునగరి దివ్యదేశము నందు తామ్రపర్ని నది తీర్థ సంగ్రహణం జరిగినది. అంతేకాకుండా మేల్కోట దివ్య క్షేతము నందు కళ్యాణి పుష్కరిణి తీర్థము, మహారాష్ట్రలోని పండరీపూర్ నందు చంద్రభాగ నదీ తీర్థం, కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం దర్శించి అక్కడ పుణ్య జలాలను తీసుకొస్తున్నారు. ఇలా వివిధ వివిధ రాష్ట్రాల్లో తిరిగి అన్ని నదులతో పాటుగా సముద్ర జలాలను సేకరిస్తున్నారు. ఈ పుణ్య జలాలతో ఈనెల 31వ తేదీన రామయ్యను అభిషేకించనున్నారు.
Bhadradri Rama Kalyana Ghattam: మరోవైపు సీతారాముల కల్యాణానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఈనెల 9వ తేదీన ప్రారంభించగా.. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం లక్ష్మణ సమేత సీతారాములను ఆలయం వద్ద నుంచి ఉత్తర ద్వారం వద్దకు తీసుకువచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ రోలు రోకలికి పూజలు నిర్వహించిన అర్చకులు అనంతరం వైష్ణవ ముత్తైదువుల చేత పసుపు కొమ్ములు దంచి తలంబ్రాలను తయారు చేయడానికి పూనుకున్నారు.