Singareni Open castmines : ఉపరితల ఆవర్తన ప్రభావంతో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. రైతాంగానికి హర్షం కలిగిస్తున్నా.. సింగరేణి సంస్థకు నష్టాన్ని మిగుల్చుతున్నాయి. భారీ వర్షానికి మంచిర్యాల జిల్లాలోని నాలుగు సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని, రామకృష్ణాపూర్ ఉపరితల గనులు, శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారంఖని, కల్యాణిఖని, రామకృష్ణాపూర్, ఖైరిగుడా ఉపరితల గనుల్లో నాలుగు రోజులుగా 92000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో సింగరేణికి సుమారు రూ.23 కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, కోయగూడెం రెండు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం ఇల్లందులో ఉపరితల గని ముగింపు దశకు వచ్చింది. నియోజకవర్గంలోనే అత్యధిక మొత్తంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కోయగూడెంలో 37 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి.. లక్ష 20 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. చిన్నపాటి చెరువును తలపించేలా గనిలోకి నీళ్లు చేరాయి. నాలుగు పెద్ద మోటార్లతో నీటిని బయటకు తోడుతున్నారు. వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. నీటిని తోడివేయడానికి పెద్ద జాక్వెల్ మోటార్లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణిలో 2, 3 ఓపెన్ కాస్ట్‌లలోకి వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.