CM KCR Nagar Kurnool Tour Today : నాగర్ కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్‌లో నాగర్‌కర్నూల్ చేరుకున్న సీఎం కేసీఆర్... మొదటగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజును కుర్చిలో కూర్చొబెట్టి ఆశీర్వదించారు.
CM KCR Inaugurate Nagar Kurnool New Collectorate : అనంతరం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్... పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 35 కోట్లు వెచ్చించి... నూతనంగా నిర్మించిన పోలీసు శాఖ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల శివారులోని కొల్లాపూర్ చౌరస్తాలో 52 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్‌ను ఛాంబర్లో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఉదయ్ కుమార్‌కి అభినందనలు తెలిపారు. 12 ఎకరాల సువిశాల స్థలంలో లక్షా 25 వేల చదరపు అడుగుల స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు రెండు అంతస్తుల్లో సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించారు. అక్కడే 32శాఖల కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి.అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వ పథకాలను విజయవంతం చేసి ప్రతిఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించినట్లు తెలిపారు. మిషన్ భగీరథ, వ్యవసాయం, ఐటీ సహా వివిధ రంగాల్లో అద్భుత ప్రగతిని నమోదు చేసినట్లు వివరించారు. సంపదను పెంచుదాం... ప్రజలకు పంచుదామన్న ముఖ్యమంత్రి కేసీఆర్... 9 ఏళ్లలో చూపిన స్ఫూర్తి మున్ముందు కొనసాగిద్దామని తెలిపారు. ఆ దిశగా అందరం కష్టపడి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు.