CM KCR Comments: మతపిచ్చి, విద్వేషాలతో ప్రజలను విడదీస్తే జాతి జీవనాడే దహించుకుపోయే పరిస్థితి తలెత్తి.. దేశం మరో ఆఫ్గనిస్థాన్‌లా మారుతుందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. దేశరాజకీయాలకు వెలుగుమార్గం చూపే అద్భుత చైతన్య వీచిక తెలంగాణ నుంచే వీయాలన్న ఆయన.. ఇందులో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పాలనాసౌధాల ప్రారంభోత్సవాల్లో భాగంగా.... మహబూబాబాద్, భదాద్రి జిల్లాల్లో ఆయన పర్యటించారు. గిరిజన, ఆదివాసీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేసి... పరిపాలన చేరువ చేసినట్లు కేసీఆర్ వెల్లడించారు.
''అప్పట్లో మహబూబాబాద్ ప్రాంతంలో బాగా కరవు ఉండేది. ఇక్కడి కరవుపై పాట కూడా రాశాను. తెలంగాణ వచ్చాక చాలా పనులు చేసుకున్నాం. చాలా జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఈ కలెక్టరేట్ ప్రజాసమస్యలు తీర్చే కార్యాలయంగా మారాలి. మహబూబాబాద్ జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్, రూ. 50 కోట్లు కేటాయిస్తున్నాం. మిగిలిన పట్టణాలకు రూ.25 కోట్ల చొప్పున కేటాయిస్తున్నాం. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు మంజూరు చేస్తాం.'' - కేసీఆర్, ముఖ్యమంత్రి
పరిపాలన సౌలభ్యం, పారదర్శక సేవలు అందించటమే లక్ష్యంగా ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూజెం జిల్లాల నూతన సమీకృత కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఘనంగా జరిగాయి. పాలనాసౌధాలతోపాటు ఆయా చోట్ల నూతనంగా నిర్మించిన భారత్ రాష్ట్ర సమితి కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట్ నుంచి హెలీకాప్టర్‌లో మహబూబాబాద్‌కు చేరుకున్న సీఎంకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్, ఎంపీలు మాలోత్ కవిత, రవిచంద్రతోపాటు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ముందుగా మహబూబాబాద్‌లోని గిరిజన భవనం పక్కన నిర్మించిన భారాస జిల్లా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం.. జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభించారు. చాంబర్‌లో కలెక్టర్ శశాంకను కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందజేసి.. శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవం తర్వాత కలెక్టరేట్ ఆవరణలో జరిగిన బహిరంగసభలో మానుకోట ప్రజలకు సీఎం వరాల జల్లు కురిపించారు.
మహబూబాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో కొత్తగూడెం చేరుకున్న సీఎంకు మంత్రి పువ్వాడ, ఎంపీ నామాతోపాటు ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. పార్టీసీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం రాములోరి ప్రసాదాన్ని సీఎంకు అందజేశారు. పాలనాసముదాయం ఆవరణలోని శిలాఫలకాన్ని ప్రారంభించి.. కలెక్టరేట్‌లో సీఎస్, మంత్రులు, అధికారులతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగించారు.