'రాజకీయ పార్టీల ఆస్తులకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి' తెరాస పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర వ్యక్తులకు, సంస్థలకు చెందిన ఆస్తులను ఎంత ఆక్రమించుకుందో అవన్నీ బయటకు తీస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గులాబీ రంగులు వేసి తెలంగాణ భవనంగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ కార్యాలయం సాధన కోసం కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బుధవారం ప్రారంభించారు. తొలత భట్టి అంబేడ్కర్ విగ్రహానికి పూలమల వేసి నివాళులర్పించారు. పురపాలక కార్యాలయానికి వెళ్లి పార్టీ భవనానికి సంబంధించిన రికార్డులు చూపించాలని కమిషనర్ వెంకటస్వామిని కోరారు. రికార్డులు కార్యాలయంలో లేవని అవి తెప్పించి పరిశీలించి వెల్లడిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.
పార్టీ కార్యాలయానికి గులాబీ రంగులు
అక్రమంగా మణుగూరు పార్టీ కార్యాలయానికి గులాబీ రంగులు వేసి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రమంతా కరోనాతో వణికిపోతుంటే, సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో ఉంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకీ చెందిన నాయకులకు చెందిన ఆస్తులపై కన్నేసి కుట్రపూరితంగా ఆక్రమించేందుకు నాంది పలికారని మండిపడ్డారు. మణుగూరు కాంగ్రెస్ కార్యాలయాన్ని పోలీసులను అడ్డుపెట్టుకుని గులాబీ రంగులు వేసి తెరాస భవనంగా మార్చారన్నారు. అధికారం ఉంది కదా అని తెరాస ప్రభుత్వం అన్ని వ్యవస్థలతో పని చేయించుకునే పరిస్థితికి చేరిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆస్తుల్ని ఆక్రమించే కార్యక్రమం చేపడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు.
మనోభావాలు దెబ్బతిన్నాయి
ఈ అంశం మణుగూరులో ఉన్న ఇందిరమ్మ భవన్కు సంబంధించిన విషయం మాత్రమే కాదని.. యావత్ దేశానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన విషయమన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. పేద ప్రజల కోసం కట్టించిన మణుగూరు కాంగ్రెస్ పార్టీ భవనాన్ని ఆక్రమించుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మణుగూరు కాంగ్రెస్ కార్యాలయంకు సంబంధించిన అన్ని పత్రాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పొందేం వీరయ్య దగ్గర ఉన్నాయన్నారు. న్యాయపరంగా కానీ, భౌతిక పరంగా కానీ మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుందన్నారు. త్వరలోనే స్వాధీనం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :'సచివాలయంపై ఉన్నంత శ్రద్ధలో కొంచెం కొవిడ్ కట్టడిపై పెట్టండి'