Batti Vikramarka on PK: రాజకీయ వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ విషయంలో తమ అధిష్ఠానం ఒక కమిటీ వేసిందని... ఆ నివేదిక చూసిన తర్వాత సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. భాజపా ఎప్పుడూ తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఎవరికీ కన్ఫ్యూజన్ అవసరం లేదని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని కావాలనే ఆరోపణలు చేస్తున్నారని భట్టి పేర్కొన్నారు. మాణిక్కం ఠాగూర్ చేసిన ట్వీట్‌లో తప్పేముందని అన్నారు. శత్రువును నమొద్దు అన్నారు కానీ ఎవరూ శత్రువు అని చెప్పారా అని భట్టి ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు. పీకే విషయంలో మీడియాలో వచ్చే ఊహాగానాలను నమ్మవద్దని చెప్పారు. అలాంటి కథనాలపై తాము స్పందించమని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పని చేస్తున్నామని... ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ క్యాడర్ను కన్ఫ్యూజన్ చేయడానికి భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.