గత 3 రోజులుగా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. బుధవారం రాత్రి, గురువారం పగలు అత్యధికంగా కొత్తగూడెం(భద్రాద్రి జిల్లా)లో 8.9, భద్రాచలంలో 7, బూర్గంపాడులో 6, పాల్వంచ 6, తల్లాడ(ఖమ్మం) 3, మహబూబ్‌నగర్ 3.7, మాచాపూర్(కామారెడ్డి)లో 2.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శుక్ర, శనివారాల్లో సైతం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది.
* గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పరివాహకంలో ఆరబెట్టిన మిరపకాయలు నీటిలో కొట్టుకుపోయాయి. చర్ల మండలం వీరాపురం, జీపీపల్లి, చింతకుంట, మొగళ్లపల్లి, సి.కత్తిగూడెం తదితర గ్రామాల్లో వరద నీటిలో పంట తేలియాడుతుండటంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు.
* మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మంచ్యా తండాలో 15 మంది గిరిజన పేద రైతులకు చెందిన మిరప పంట కోసి కల్లాల్లో ఆరబోయగా పూర్తిగా నీటమునిగి పాడైంది. అప్పుల నుంచి ఎలా గట్టెక్కాలని పేద రైతులు వాపోతున్నారు. ఎకరాన్నర మిరప సాగుకు రూ.లక్షా 20 వేలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టినట్లు రవి అనే రైతు ‘ఈనాడు’ ప్రతినిధి వద్ద వాపోయారు.
* కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మార్కెట్‌లో కొత్తపల్లికి చెందిన రైతు శనిగరపు దామోదర్, ఏనుగుల గంగయ్యలు ఆరబెట్టిన ధాన్యం 7-8 ట్రక్కుల మేర వర్షం నీటికి కొట్టుకుపోయి ఎస్సారెస్పీ కాలువ పాలైంది.