ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో డబ్బులు వసూలుచేసిన దంపతులకు బాధితులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరింది.
పాల్వంచ వికలాంగుల కాలనీకి చెందిన మేఘన సరస్వతి తన భర్త రాంబాబుతో కలిసి 2019లో కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలుచేసింది. ఇలా సుమారు 91 మంది నుంచి.. కోటి 90 లక్షలు వసూలుచేసినట్లు బాధితులు తెలిపారు. తీరా మెరిట్ జాబితాలో పేరులేకపోవడం వల్ల మోసపోయామని గ్రహించిన బాధితులు.. గత నెల 26న పాల్వంచ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు.
అప్పటి నుంచి తమకు దొరక్కకుండా మేఘన, రాంబాబు తప్పించుకొని తిరుగుతున్నారని బాధితులు తెలిపారు. మంగళవారం మాటువేసి.. వారిని నిలదీసినట్లు చెప్పారు. మాటామాట పెరిగి దంపతులిద్దరికీ బాధితులు దేహశుద్ధి చేశారు. చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు వచ్చి వారిని కాపాడారు. అంతలోనే మేఘనకు ఫిట్స్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు... వారి వాహనంలోనే పాల్వంచ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.