మహత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని ఉద్యాన పంటలకు వర్తింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన పంటలకు అనుసంధానం చేయటం ద్వారా ఇప్పుడు రైతులకు ఎక్కువగా మేలు జరగనుంది. వ్యవసాయరంగం పటిష్టం కానుంది. గతంలో ఉన్న రాయితీలతో పోలిస్తే ఇప్పుడు ఇచ్చే పథకాలకు రాయితీలు చాలా ఎక్కువగా ఉండటం విశేషం. గతంలో ఉద్యాన పథకం ద్వారా ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులకు ఎకరానికి రూ.12వేల వరకు మాత్రమే రాయితీ ఉండేది. ఇప్పుడు ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయటం ద్వారా ఎకరానికి రూ.51,275 వరకు రాయితీ అందుతుంది. మొక్కల కొనుగోళ్లు, తోటల నిర్వహణకు కూడా రాయితీని గణనీయంగా పెంచారు. పండ్లతోటలు, పందిరి కూరగాయల సాగుకు కూడా పెద్దఎత్తున ప్రోత్సాహం కల్పిస్తున్నారు.
ఉద్యాన పంటలకు ఉపాధి.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం! - ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం
ఉద్యాన పంటలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం నుంచి అమలు కానున్న ఈ పథకం ద్వారా ఉద్యాన పంటలు వేసుకునే రైతులకు పెద్ద ఎత్తున రాయితీలు అందనున్నాయి. దీనికి సంబంధించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమం చురుగ్గా మొదలైంది.
![ఉద్యాన పంటలకు ఉపాధి.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం! center promotion for horticultural crops with employment guarantee scheme](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8533827-511-8533827-1598247604635.jpg)
ఇప్పటికే ఉద్యానశాఖ అధికారులు లబ్ధిదారుల వివరాలను సేకరించి మండల పరిషత్ అభివృద్ధి అధికారుల ద్వారా డీఆర్‌డీవోలకు పంపుతున్నారు. లబ్ధిదారుల జాబితా అందిన తర్వాత వారి అర్హతలను పరిశీలించి పథకానికి సంబంధించిన అంచనాలను తయారు చేస్తారు. ఉద్యానశాఖ, ఉపాధి హామీ అధికారులు సమన్వయంగా లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. సన్న, చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతులు, మహిళా రైతులకు పథకంలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి అనసూయ సూచించారు. ఈ పథకం ద్వారా ద్వారా ఆర్థికంగా రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైంది. రైతులు దరఖాస్తు చేస్తే అర్హులను ఎంపిక చేస్తున్నామని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి :విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ