Booster Dose In singareni: దేశ వ్యాప్తంగా కొవిడ్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న వైద్య విభాగం, ఏరియా జీఎంలు సర్వసన్నద్ధంగా ఉండాలని ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్, పర్సనల్ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశించారు. సింగరేణి భవన్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులకు ఇప్పటికే దాదాపు వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేశామనీ.. ఇంకా ఎవరైన మిగిలి ఉంటే వారి ఇళ్ల వద్దకే వెళ్లి వాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. 60 సంవత్సరాల పైబడిన కార్మికులకు ఈ నెల 10 నుంచి 2 రోజుల్లో బూస్టర్ డోస్ వేయాలని ఆదేశించారు.
రాష్ట్ర వైద్యశాఖ ఆధ్వర్యంలో 15 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాక్సినేషన్‌ను ప్రారంభించారనీ.. సింగరేణి ప్రాంతంలో ఈ వయస్సు గ్రూపు వారికి కంపెనీ ఆస్పత్రుల్లో వాక్సినేషన్ చేయాలన్నారు. ప్రస్తుతం 40 వేల రాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్లు సిద్ధంగా ఉన్నప్పటికీ.. రానున్న కాలంలో వీటి కొరత సింగరేణిలో ఏర్పడకుండా ఉండటానికి మరో 50 వేల కిట్లు కొనుగోలు చేయనున్నామని తెలిపారు.