Ramadasu Jayanthi Celebrations: భక్త రామదాసు 389వ జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కరోనా కారణంగా అతి కొద్ది మందితో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భద్రాద్రిలో ప్రత్యేక పూజల నడుమ వేడుకలు జరగ్గా.. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పాల్గొన్నారు.
ఘనంగా భక్త రామదాసు జయంత్యుత్సవాలు భద్రాద్రిలో
భద్రాద్రిలో భక్త రామదాసు విగ్రహానికి ఆలయ అర్చకులు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని చిత్రకూట మండపంలో వాగ్గేయకారోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు.. భక్త రామదాసు కీర్తనలు ఆలపిస్తున్నారు. భక్త రామదాసు చేయించిన ఏడువారాల నగలను లక్ష్మణ సమేత సీతారాములకు అర్చకులు అలంకరించారు. చిత్రకూట మండపంలో స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
స్వస్థలంలో
రామదాసు జన్మస్థలం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్త రామదాసు ధ్యాన మందిరంలో ఆరాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనల ప్రకారం కొంతమందికే అనుమతి ఇవ్వడంతో ఉత్సవాలకు తక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రముఖ వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి చెందిన భక్త రామదాసు.. సీతమ్మకు చింతాకు పతకము తయారు చేయించినట్లు చరిత్ర వివరిస్తుంది.
హైదరాబాద్‌లో
కరోనా కారణంగా రామదాసు జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించలేకపోతున్నామని.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న భక్త రామదాసు విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకల్లో.. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో కలిసి మంత్రి పాల్గొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ, హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలు జరిగాయి.
"కొవిడ్ కారణంగా రామదాసు జయంత్యుత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నాం. మరో అయోధ్య భద్రాద్రి రాముని గురించి సంకీర్తనలతో రామదాసు ఎంతో అద్భుతంగా రాశారు. పరిస్థితులు సద్దుమణిగాక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం." -శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి
"రామదాసు ప్రాజెక్టు కోసం ఉమ్మడి రాష్ట్రంలో జీవో తెచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ విషయం అంతగా దృష్టికి రాలేదు. రామదాసు ప్రాజెక్టు గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాను." - కేవీ రమణా చారి, ప్రభుత్వ సలహాదారు
తిరుమలలో అన్నమయ్య ప్రాజెక్టు మాదిరిగా.. భద్రాద్రిలో రామదాసు ప్రాజెక్టును ప్రభుత్వం ఏర్పాటుచేయాలని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ భక్త రామదాసు సంగీత కళాశాల, రమా ప్రభ ఆధ్వర్యంలో చేసిన నవరత్న కీర్తనల గోష్టి గానం అలరించింది.
ఇదీ చదవండి:ముచ్చింతల్‌లో మూడోరోజు వైభవంగా రామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు