భద్రాద్రి రామయ్య సన్నిధిలో శబరి నాటకాన్ని ప్రదర్శించారు. విశాఖకు చెందిన శ్రీ వెంకట కృష్ణ అన్నమాచార్య సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శన ఇచ్చారు. రామలక్ష్మణ, అపర భక్తురాలు శబరి వేషధారణలతో చేసిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. రామయ్యకు ఎంగిలి పండ్లు తినిపించిన దృశ్యాలను ప్రదర్శించారు. సీతారాములపై ఉన్న భక్తితో అనేక ఆలయాల్లో శబరి చరిత్రపై ప్రదర్శనలు ఇచ్చామని బృంద నిర్వాహకురాలు విజయలక్ష్మి తెలిపారు.
అంతకు ముందు బృందానికి చెందిన మహిళలు స్వామి వారికి లక్షా 50 వేల నగదు విరాళంగా అందచేశారు. రామనామస్మరణతో ఏళ్ల తరబడిగా రాసిన రామకోటిని సమర్పించారు. తదుపరి ఆంజనేయస్వామి ఆలయం వద్ద సుందరకాండ పారాయణం నిర్వహించారు. విశాఖపట్నంలో సుందరకాండ పారాయణం నిర్వహించి పోగుచేసిన నగదును స్వామికి సమర్పించినట్లు విజయలక్ష్మి తెలిపారు.
"సీతారాముల సన్నిధిలో కోలాటం, శబరి ఘట్టం వేశాం. సీతాపహరణం తర్వాత రామలక్ష్మణులు శబరి మాత ఆశ్రమానికి చేరుకుంటారు. నేను చాలా చోట్ల శబరి నాటకాలు వేశాను. తిరుమల, అన్నవరం,అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. కానీ ఈరోజు రామలక్ష్మణులు స్వయంగా వచ్చి నాటక వేశారన్న అనుభూతి కలుగుతోంది."