భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రామయ్య రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏడో రోజైన నేడు తన నిజరూపంలో శ్రీరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
భద్రాచలం రామాలయాన్ని నిర్మించిన భక్త రామదాసు చేయించిన ఏడువారాల నగలు లక్ష్మణ సమేత సీతారాములకు అలంకరించారు. ఆభరణాలను స్వామి వారికి ధరింప చేయడం వల్ల ఉత్సవ మూర్తులు భక్తి మనోహరంగా దర్శనమిచ్చారు. బేడా మండపంలో పూజలు నిర్వహించిన అర్చకులు.. అనంతరం ప్రధాన ఆలయంలో మహానివేదన సమర్పించారు. తదుపరి సకల రాజస్వామి చిత్రకూట మండపం వద్ద స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.