Vanama raghava arrested: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో రాఘవేంద్రరావు భద్రాద్రి పోలీసులకు చిక్కాడు. కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మం. మందలపల్లి వద్ద రాఘవతో పాటు అతడి ప్రధాన అనుచరుడు గిరీశ్, కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏ-2గా ఉన్న రాఘవను విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. పాల్వంచకు తరలించారు. రాత్రంతా సబ్‌డివిజన్ కార్యాలయంలో పోలీసులు విచారణ చేశారు. తనపై నమోదైన కేసులు, ఆరోపణలపై తెల్లవారుజాము వరకు ప్రశ్నించారు.
గతంలో నమోదైన కేసులు వెలికి..
ఈ నెల 3న భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ నాగ రామకృష్ణ.. అంతకుముందు తీసుకున్న సెల్ఫీవీడియోలో వనమా రాఘవపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అవమానం భరించలేక కుటుంబంతో సహా చనిపోతున్నట్లు రామకృష్ణ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన బయటికి వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్న రాఘవ ఆచూకీ కోసం పోలీసులు... రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు.. మందలపల్లి అడ్డరోడ్డు వద్ద రాఘవను పోలీసులు పట్టుకున్నారు. గతేడాది వెంకటేశ్వరరావు ఆత్మహత్య కేసులో రాఘవకు నోటీసులు ఇవ్వటం సహా.. రాఘవపై గతంలో నమోదైన కేసులను పోలీసులు వెలికితీస్తున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏ-2గా ఉన్న వనమా రాఘవను.. ఇప్పటికే తెరాస అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఆది నుంచీ వివాదాస్పదమే..
వనమా రాఘవేంద్రరావుపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఘటనల్లో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజాప్రతినిధి కుమారుడిగా వనమా.. రాజకీయ వారసుడిగా నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న రాఘవ తీరు ఆది నుంచీ వివాదాస్పదమే. పాల్వంచ గ్రామీణం, పట్టణ పోలీస్ స్టేషన్‌లలో ఇప్పటి వరకు మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. పాల్వంచ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో వనమా రాఘవేందర్‌రావుపై పలు సెక్షన్ల కింద 2 కేసులు నమోదయ్యాయి. 2013లో ప్రభుత్వ ఉద్యోగి ఉత్తర్వులు ఉల్లంఘించి, ఎన్నికల్లో డబ్బులు ఎర వేశారని కేసు నమోదైంది. అదే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, విధులకు ఆటంకం కలిగించి దౌర్జన్యం చేశారంటూ కేసు ఉంది. పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. 2006లో ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి అల్లరి మూకలతో కలిసి హంగామా చేశాడన్న ఆరోపణలపై కేసును ఎదుర్కొన్నాడు. 2017లో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదైంది. 2020లో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని కేసు పెట్టారు.