భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నాలుగు కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ ఎన్వీ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇల్లెందులో పర్యటించిన ఆయన అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజా ప్రతినిధులు, వైద్యాధికారుల సమక్షంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు.
జిల్లాలో మెుత్తం నాలుగు కేంద్రాలలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తామన్న కలెక్టర్... కొత్తగూడెంలో 2, భద్రాచలంలో 1, ఇల్లెందులో 1 కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శనివారం 120 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నామని చెప్పారు. టీకా పట్ల అపోహలొద్దన్న ఎన్వీ రెడ్డి ఎటువంటి వ్యాక్సిన్ అయినా కొందరిలో రియాక్షన్ సమస్యలు వస్తాయని వివరించారు. అలాంటి వారికి చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.