Bhadradri Kothagudam ZP chairman Kanakaiah resigned : పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య అనుచరులతో కలసి జులై 2న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో.. ఖమ్మంలోని జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో భద్రాద్రి జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈమేరకు ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అందుకు సంబంధించిన.. అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. ఇల్లందు జెడ్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. బీఆర్ఎస్, కేసీఆర్‌లపై విమర్శలు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గంలో ముఖ్య నాయకుడిగా ఉన్న భద్రాద్రి జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో ఎందరో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో.. అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా న్యాయం చేయలేకపోయిందని కనకయ్య అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్కు రాజీనామా చేసి.. ఒక జెడ్పీటీసీ, 56 మంది సర్పంచులు, 26 మంది ఎంపీటీసీలు, ఒక ఇల్లందు మున్సిపల్ కౌన్సిలర్, పీఎసీఎస్ ఛైర్మన్, పలువురు నాయకులు, కార్యకర్తలు చేరనున్నారని వెల్లడించారు.
"ఇల్లందు నియోజవర్గంలోని ఐదు మండలాల సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరనున్నాము. ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభలో అందరం కలసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నాము. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో తెలంగాణను సంపాదించుకున్నాం. కానీ బీఆర్ఎస్ ఆ కలను సాకారం చేయలేకపోయింది." -కోరం కనకయ్య, భద్రాద్రి జెడ్పీ ఛైర్మన్