స్వాగత తోరణాలు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపకాంతులతో భద్రాద్రి దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. ఇవాళ ఎదుర్కోలు మహోత్సవం, రేపు మిథిలా ప్రాంగణంలో సీతారాముల కల్యాణం జరగనుంది. ఏప్రిల్ 6న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 వరకు సాగనున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 10న అంకురార్పణ జరగగా.. 11న గరుడాధివాసం, 12న అగ్నిప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం శ్రీరాముడి మహాపట్టాభిషేక కార్యక్రమానికి భద్రాద్రి ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
భక్తులకు తలంబ్రాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రగిరిలో ఆధ్యాత్మికత వెల్లువిరుస్తోంది. దాదాపు లక్షకు పైగా భక్తులు వేడుకలకు హాజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తోంది. వేసవి తాపం దృష్ట్యా.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భద్రాచల పురవీధుల్లో సీసీటీవీలు, ఎల్ఈడీ తెరలు అమర్చుతున్నారు. రాములవారి కల్యాణాన్ని వీక్షించి తరించి తిరిగి వెళ్లే భక్తులకు మధురానుభూతిని మిగిల్చేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రామయ్య పెళ్లికి వచ్చే ప్రతి భక్తుడికీ తలంబ్రాలు అందించే ఉద్దేశంతో 30 వరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తోంది. 150 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలు సిద్ధమయ్యాయి.