Kovvur- Bhadrachalam railway line: ఉమ్మడి రాష్ట్రంలో మంజూరై తొమ్మిదేళ్లయినా భద్రాచలం రోడ్ - కొవ్వూరు కొత్త రైలు మార్గం నిర్మాణంలో పురోగతి కనిపించడంలేదు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2,154 కోట్లు కాగా ఇప్పటి వరకు ఖర్చు చేసింది కేవలం 2.46 కోట్లు మాత్రమే. తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన రైల్వే లైను, దగ్గరి దారి నిర్మాణం విషయంలో అటు రైల్వేశాఖ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. భద్రాచలం రోడ్ - కొవ్వూరు కొత్త బ్రాడ్‌గేజ్ లైను వస్తే.. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు కనీసం 40 - 50 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కొత్తగా అనేక రైళ్లు నడిపే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం నుంచి దిల్లీకి రైళ్ల రాకపోకలకు కొత్త మార్గం అందుబాటులోకి వస్తుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం దగ్గర ప్రాంతానికి రైలుమార్గం అనుసంధానం అవుతుంది.
మారిన ఎలైన్‌మెంట్...
భద్రాచలం రోడ్ నుంచి చంద్రగొండ – మద్దుకూరు - అన్నపురెడ్డిపల్లె - దమ్మపేట – అశ్వారావుపేట – జీలుగుమిల్లి - జంగారెడ్డిగూడెం - కొవ్వూరు వరకు కొత్త లైన్ నిర్మించాలని తొలుత అనుకున్నారు. మరో మార్గం భద్రాచలం రోడ్ - సత్తుపల్లి మధ్య కొత్త లైను 2010-11లోనే మంజూరైంది. సింగరేణి సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో రైల్వేశాఖ ఈ ప్రాజెక్టు చేపట్టి కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో భద్రాచలంరోడ్ - కొవ్వూరు లైను ఎలైన్‌మెంట్‌ను మార్చి సత్తుపల్లి నుంచి దమ్మపేట మీదుగా జీలుగుమిల్లి - జంగారెడ్డిగూడెం - కొవ్వూరు మార్గాన్ని రైల్వే శాఖ ఖరారు చేసింది.
రైల్వే శాఖ ఏమంటోంది?
కొత్త లైనుకు తెలంగాణలో నిర్మాణ వ్యయం రూ. 723.58 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ.. చెరి రూ. 361.79 కోట్లు భరించాలి. ఏపీలో నిర్మాణ వ్యయం 1419.13 కోట్లు. రైల్వే శాఖ, ఏపీ ప్రభుత్వం... చెరి 709.56 కోట్లు భరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. భద్రాచలంరోడ్ - సత్తుపల్లి లైనుకు సింగరేణి సంస్థ చెల్లిస్తున్న వాటాను ప్రస్తావిస్తూ రాష్ట్ర వాటాగా పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని దక్షిణ మధ్య రైల్వే వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వాటా అడుగుతూ 2020 నవంబరు 10న ఏపీ ప్రభుత్వానికి దక్షిణ మధ్య రైల్వే లేఖ రాసింది. సగం నిర్మాణ వ్యయాన్ని భరించినా వచ్చే ఆదాయంలో వాటా లేకపోవడం, కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భరించేందుకు ఆసక్తి చూపించట్లేదని తెలుస్తోంది.
చురుగ్గా భద్రాచలంరోడ్ - సత్తుపల్లి పనులు...
మరోపక్క సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన భద్రాచలంరోడ్ - సత్తుపల్లి కొత్త లైన్ పనులు కొంతకాలంగా చురుగ్గా సాగుతున్నాయి. భద్రాచలం రోడ్ నుంచి చంద్రగొండు వరకు 23.60కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. చంద్రగొండు నుంచి పెనుబల్లి-సత్తుపల్లి వరకు మట్టిపనులు పూర్తయ్యాయి. ట్రాక్‌పై స్లీపర్ల అమరిక వంతెనల నిర్మాణం జరుగుతోంది. ఇది పూర్తయితే సికింద్రాబాద్ నుంచి కాజీపేట, డోర్నకల్ మీదుగా సత్తుపల్లి వరకు రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. భద్రాచలంరోడ్-సత్తుపల్లి మధ్య సింగరేణి బొగ్గు గనులున్నాయి. బొగ్గు రవాణాకు ఈ కొత్త మార్గం అధికంగా ఉపయోగపడుతుంది.
ఇదీ చదవండి:MP Arvind Comments: 'రానున్న ఎన్నికల్లో భాజపా విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి'