వర్షాకాలం వచ్చిందంటే భద్రాద్రి జిల్లావాసుల్లో గోదావరి వరద భయం గూడు కట్టుకుంటుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందన్న నిపుణుల ప్రకటనలతో భద్రాద్రి ప్రజల గుండెల్లో ఆందోళన మొదలైంది. గతంలో ప్రతి ఏటా వర్షాకాలం వచ్చే గోదావరి వరదలకు భద్రాచలంలోని చాలా ప్రాంతం నీటిలో మునిగిపోయేది. లోతట్టు ప్రాంతాల్లోని అనేక గ్రామాలు, పంటలు నీట మునిగేవి. భద్రాద్రి ప్రజలు పడుతున్న బాధలు చూసి అప్పటి తెదేపా ప్రభుత్వం వరద నీరు పట్టణంలోకి రాకుండా భద్రాచలం పట్టణం చుట్టూ సుమారు 10 కిలోమీటర్ల మేర కరకట్టను నిర్మించింది. అప్పటి నుంచి పట్టణ ప్రజలు కొంతవరకు వరద ప్రవాహం నుంచి బయట పడినప్పటికీ.. గోదావరి బ్యాక్‌వాటర్‌తో ఇప్పటికీ అనేక లోతట్టు కాలనీలు, గ్రామాలు నీట మునుగుతున్నాయి.
పోలవరం పూర్తయితే..?
గత నెలలో కురిసిన భారీ వర్షాలకు.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 62 అడుగులకు చేరింది. భద్రాద్రి జిల్లాలోని మణుగూరు, దుమ్ముగూడెం, అశ్వాపురం, భద్రాచలం మండలాల్లోని చాలా గ్రామాలు, వేల ఎకరాల పంట పొలాలు వరద నీటిలో మునిగాయి. సుమారు వారం రోజులు వేలాదిమంది ప్రజలు వరద నీటిలో మునిగిన ఇళ్లను వదిలేసి పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. వేల ఎకరాల భూమి వరదనీటిలో మునగడం వల్ల పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. అయితే భద్రాచలానికి దిగువ ప్రాంతంలో గల ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం వద్ద ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావస్తుండటం భద్రాద్రి ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. మామూలుగానే 62 అడుగుల గోదావరి నీటిమట్టం వస్తే.. భద్రాద్రి చుట్టు పక్క పలు మండలాలు నీట మునిగాయి. పోలవరం పూర్తయితే ఆ ప్రమాదం మరింత తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ అధికారులే సర్వే చేసి నిర్ధారించారు.