Bhadrachalam Government Hospital Many Problems: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలకు భద్రత కరవైంది. ఏజెన్సీ ప్రాంతంలో 4 రాష్ట్రాల గిరిజన ప్రాంతవాసులకు అందుబాటులో ఉన్నఇక్కడ పరిస్థితులు దయనీయంగా మారాయి. 200 పడకలతో ఉన్న ఈ పెద్దాసుపత్రికి.. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ప్రాంతాల నుంచి నిత్యం వైద్యం కోసం వస్తుంటారు.
ఆయా రాష్ట్రాల్లోని ప్రధానంగా గిరిజన ప్రాంతాలకు చెందిన వారు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు స్థోమత లేక భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. కానీ ఇక్కడ వైద్యులు అందుబాటులో ఉండక.. కావాల్సిన సౌకర్యాలు లేకపోవటంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన ప్రాంతాల నుంచి రోజూ అనేక మంది గర్భిణులు ఈ ఆసుపత్రికి వస్తుంటారు.
ఒకప్పుడు నెలకు 600లకు పైగా ప్రసవాలు:కానీ గర్భిణులకు ప్రసూతి వైద్య సేవలు అందించేందుకు ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరు. ఆరు నెలలుగా ఒక్క వైద్యుడితో నెట్టుకురాగా పని ఒత్తిడి తట్టుకోలేక ఉన్న ఒక్క వైద్యుడు వెళ్లిపోవటంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఆరు నెలలుగా ఆసుపత్రిలో టెక్నీషియన్ లేక స్కానింగ్ విభాగాన్ని మూసివేశారు. ఒకప్పుడు నెలకు 600లకు పైగా ప్రసవాలు జరిగేవి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంఖ్య పదుల్లోకి చేరింది. రోజుకు ఒక ప్రసవం చేయడమే కష్టంగా మారినట్లు సిబ్బంది చెబుతున్నారు. గైనకాలజిస్ట్‌తో పాటు ఇతర వైద్యులు అందుబాటులో లేకపోవటంతో ఇక్కడి వచ్చే గర్భిణులను కొత్తగూడెం ఆసుపత్రికి తరలిస్తున్నారు. పురిటి నొప్పులతో వచ్చే వారి పరిస్థితి మాత్రం దారుణంగా మారింది. స్కానింగ్ విభాగం మూతబబడిన కారణంగా ప్రైవేట్ సెంటర్లలో వేల రూపాయలు వెచ్చిస్తూ పరీక్షలు చేయించుకుంటున్నారు.