భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం చివరి 3వ ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 60.5 అడుగులు దాటింది. వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు.
సంబంధాలు నిలిచిపోయాయి
గోదావరి నీటిమట్టం పెరగడం వల్ల భద్రాచలంలోని కల్యాణ కట్ట, స్నాన ఘట్టాలు, శ్మాశాన వాటిక దిగువన ఉన్న విస్టా కాంప్లెక్స్, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ వరద నీటిలో మునిగిపోయాయి. భద్రాద్రి రామయ్య సన్నిధి వద్ద గల తూర్పు మెట్లకు వరద పోటెత్తింది. అన్నదాన సత్రం వరద నీటిలో మునిగిపోయింది. భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై వరద నీరు రావడం వల్ల ఏజెన్సీ మండలాలకు విలీన మండలాలకు పూర్తిగా సంబంధాలు నిలిచిపోయాయి. జిల్లాలోని పాల్వంచ వద్దగల నాగారం వంతెనపై గండి పడటం వల్ల భద్రాచలం నుంచి ఖమ్మంకు ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపివేశారు.
వరద ప్రవాహంలో గ్రామాలు