అధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం చాలా అరుదు. అయితే ఓ ఉన్నతాధికారి భార్య ఏకంగా సర్కార్ దవాఖానాలో ప్రసవించి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ అధికారి ఎవరో కాదు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి. ఈ దంపతులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో పండంటి మగబిడ్డ జన్మించింది. మంగళవారం రాత్రి 1.19 నిమిషాలకు బిడ్డ పుట్టింది. ఆసుపత్రి వైద్యులు రామకృష్ణ, భార్గవి నేతృత్వంలో ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో సురక్షితంగా ప్రసవం చేసిన వైద్యులను కలెక్టర్ అనుదీప్ అభినందించారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకం కలిగించేందుకు కలెక్టర్ చేసిన ప్రయత్నం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. గతంలో ఇక్కడ ఐటీడీఏ పీవోగా చేసిన గౌతమ్ తన సతీమణిని ఇదే దవాఖానాలో పురుడు కోసం చేర్పించారు.
పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు పొందాలని కలెక్టర్ దంపతులు సూచించారు. కలెక్టర్ దంపతులకు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తెరాస హయాంలో ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపారు.