రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదురవుతోన్న స్పందించని సీఎం.. అవసరమా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఇటీవల కొవిడ్ కారణంగా మరణించిన భాజపా ఇల్లందు నాయకుడు కుటుంబరావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జిల్లాస్థాయిలో ఒక తీరు.. రాష్ట్ర స్థాయిలో మరొక తీరు కరోనా కేసుల సంఖ్య చెబుతున్నారని విమర్శించారు.
ప్రశాంతమైన భాగ్యనగరం కొవిడ్ నగరంగా మారిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా చాలా మంది పేద ప్రజలు మరణించారని.. వైరస్‌తో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం రూ. 40 వేల దాకా ఖర్చు వస్తోందన్నారు. కొవిడ్ టెస్టుల సంఖ్య పెంచాలని మేధావులు, కేంద్రప్రభుత్వం, పలువురు సూచనలు చేసినా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పలువురు భాజపా నాయకులు కార్యకర్తలు సైతం కొవిడ్ కారణంగా మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.