తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలవరం నిర్మాణంతో భద్రాద్రి ప్రజల్లో ముంపు భయం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం భద్రాచలం పరిధిలోని ప్రజల్లో వణుకుపుట్టిస్తోంది. ఇటీవల భారీ వర్షాలకు గోదావరిలో నీటిమట్టం 62 అడుగులకు చేరడం భయాన్ని రెట్టింపు చేసింది. పోలవరం పనుల వల్లే బ్యాక్‌ వాటర్‌ ఎగదన్ని నీటి నిల్వ పెరిగిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముంపుపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్న భద్రాద్రి వాసులు... శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. ముంపు అంశంపై తెలుగు రాష్ట్రాలు దృష్టి సారించాలని ఎన్జీటీ ఆదేశించడం కొంత మేర ఫలితం రానుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

BADRADRI PEOPLE FEAR ABOUT POLAVARAM PROJECT
BADRADRI PEOPLE FEAR ABOUT POLAVARAM PROJECT

By

Published : Sep 19, 2020, 10:27 PM IST

భద్రాద్రి జిల్లా వాసుల్లో వర్షాకాలం వచ్చిందంటే భయం మొదలవుతుంది. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో జనం నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. గతంలో ముంపు ముప్పు అధికంగా ఉండేది. గోదావరి వరదలకు భద్రాచలంలోని చాలా ప్రాంతం నీట మునిగేది. లోతట్టు ప్రాంతాల్లోని అనేక గ్రామాలు, పొలాలు ముంపు భారినపడేవి. అప్పట్లో అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వం భద్రాచలం పట్టణం చుట్టూ కరకట్టను నిర్మించింది. సుమారు 10 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన కరకట్ట.. భద్రాచలం పట్టణ ప్రజలు కొంత ఊపిరిపీల్చుకునేలా చేసింది. అయినా బ్యాక్ వాటర్‌ వల్ల లోతట్టు కాలనీలు, గ్రామాలు నీట మునుగుతున్నాయి. గత నెలలో భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 62 అడుగులకు చేరింది. భద్రాద్రి జిల్లా లోని మణుగూరు, దుమ్ముగూడెం, అశ్వాపురం, భద్రాచలం మండలాల్లోని చాలా గ్రామాలు, వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద చేరగా బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు.

ప్రస్తుతం భద్రాచలానికి దిగువన ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం భద్రాద్రి జిల్లా వాసుల భయాన్ని మరింత పెంచుతోంది. ప్రాజెక్టు పూర్తై నీటిని నిల్వచేస్తే.. పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. గోదావరిలో నీటిమట్టం 62 అడుగుల చేరితేనే ముంపు ఇంతగా ఉందని పోలవరం పూర్తిచేస్తే...లోతట్టు గ్రామాలకు ముంపు తప్పదేమోనని ఆందోళన చెందుతున్నారు. గోదావరి కరకట్ట ఎత్తు ఇంకా పెంచాలని...చాలా దూరం వరకు పొడిగించాలని భద్రాద్రి జిల్లా ప్రజలు కోరుతున్నారు. బూర్గంపాడు మండలంలోని సారపాక వైపు కరకట్టను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

భద్రాచలం వద్ద ముంపు నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్‌ ఎగువ రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేయాలని NGT ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముంపు ప్రభావంపై ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ నివేదికను ఆమోదించిన NGT.. ఎగువ రాష్ట్రాల సందేహాలను తీర్చాలన్న సిఫారసులకు సుముఖత తెలిపింది. భద్రాచలం వద్ద గోదావరి నది ఇరువైపుల ముంపునకు గురయ్యే అంశంపై తెలుగు రాష్ట్రాలు చర్చించి చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇదీ చూడండి: జలసిరులతో ప్రాజెక్టుల తొణికిసలు... నదుల పరవళ్లు...

ABOUT THE AUTHOR

...view details