కొత్తగూడెం రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండేళ్ల క్రితమే ఎంఏ(ఆంగ్లం) కోర్సును తొలగించారు. ఈ సమాచారాన్ని కాకతీయ విశ్వవిద్యాలయానికి తెలియజేసినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. అయితే ఇటీవల నిర్వహించిన కామన్ పోస్టుగ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) అర్హత సాధించిన అభ్యర్థుల్లో 17 మంది కౌన్సెలింగ్ సమయంలో రామచంద్ర కళాశాలలో ఎంఏ ఆంగ్లం కోర్సును ఎంపిక చేసుకున్నారు.
ఎత్తేసిన కోర్సులో సీట్లిచ్చారు! - Bhadradri Kottagudem District Latest News
ప్రవేశపరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌లో ఎంపిక చేసుకున్న కళాశాలలో సీట్లను కేటాయించారు. తీరా మంగళవారం కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి వచ్చినవారికి ఆ కోర్సును రెండేళ్ల క్రితమే ఎత్తివేశారని తెలియడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.
మంగళవారం వారు కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి రాగా కోర్సు లేదనే విషయం తెలిసింది. బుధవారం నాటితో సెల్ఫ్‌రిపోర్టింగ్‌కు గడువు ముగుస్తుండటంతో అభ్యర్థులు సీటును కోల్పోవడంతో పాటు విద్యాసంవత్సరం సైతం నష్టపోయే పరిస్థితి తలెత్తింది. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపల్ డా.మాధవిని ఈ విషయమై వివరణ కోరగా.. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, గతంలోనే ఎంఏ ఆంగ్లం కోర్సును తొలగించారన్నారు. విశ్వవిద్యాలయం దృష్టికి సమస్యను తీసుకువెళ్లి అభ్యర్థులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని, బుధవారం ఉదయం అభ్యర్థులు కళాశాలలో తనను కలవాలని ఆమె సూచించారు.