తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాలానికి వరద తగ్గింది... బురద వచ్చి చేరింది... - water levels in badrachalam

భద్రగిరి వద్ద గోదావరిలో స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యం వస్తుందని స్థల పురాణాలు ఘోషిస్తుండగా ఇక్కడి ఏర్పాట్లు ఘోరంగా ఉన్నాయి. ఇటీవల గోదారికి వరదొచ్చి తగ్గి ప్రస్తుతం సాధారణ స్థాయికి చేరుకుంది. నీటిమట్టం గురువారం 26 అడుగుల కన్నా తగ్గింది. ఇక సాధారణ పరిస్తితులు నెలకొన్నాయని అనుకుంటే... ఇప్పుడు బురద సమస్య తలనొప్పిగా మారింది.

badrachalam ghats filled with full of mud
badrachalam ghats filled with full of mud

By

Published : Aug 28, 2020, 1:16 PM IST

భద్రాచలం ఆధ్యాత్మిక కేంద్రంలో పారిశుద్ధ్య చర్యలపై అధికారులు శీతకన్నేశారు. కరోనా విజృంభిస్తున్నా.. కొవిడ్‌ నిబంధనలను అనుసరించి రామాలయం దర్శనానికి భక్తులు వస్తున్నారు. కల్యాణకట్ట మూసేసి ఉన్నప్పటికీ ఈ ఘాట్‌లో ప్రైవేటు వ్యక్తుల సాయంతో తలనీలాలను సమర్పిస్తున్నారు. ఇలాంటి ఘాట్‌లో పవిత్రత కనిపించకుండా బురద కప్పేసింది. ఈ పని చేయాలని ఆదేశించే వారు లేకపోవడంతో దీన్ని తొలగించే వారు ఇటు వైపు చూడడం మానేశారు. మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కనిపించింది.

ఎంతోమంది మహనీయులు నడిచిన ప్రధాన ఘాట్‌లో వరదకు కొట్టుకొచ్చిన ముళ్ల చెట్లు కూరుకుపోయాయి. అడుగు తీసి అడుగేస్తే దిగబడిపోతోంది. పలుచోట్ల ఘాట్‌ మరమ్మతులకు గురైనందున తక్షణం బాగు చేయకపోతే మిగతా చోట్ల పగిలే ప్రమాదం ఉంది. దుస్తులు మార్చుకునే తాత్కాలిక సదుపాయం అస్తవ్యస్తమైంది. ఈ ప్రాంతంలో భరించరాని దుర్వాసన వెదజల్లుతోంది. ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు కనీసం కాసిన్ని నీళ్లు తలపై చల్లుకోవాలన్నా ఇక్కడి దుర్గంధ ఇబ్బంది కలిగిస్తోంది. గతంలో గ్రామ పంచాయతీ అధికారులు ఇలాంటి పనుల్లో చురుగ్గా ఉండేవారు. ఈ సారి పట్టించుకోవడం లేదని భక్తులు అంటున్నారు.నీటిపారుదలశాఖ సిబ్బంది ఈ పని తమది కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడికి ఎక్కువగా వచ్చేది భక్తులే. ఇలాంటప్పుడు రామాలయం అధికారులైనా కాస్త దృష్టి సారిస్తే బాగుంటుందని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details