భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఒడ్డుగూడెంకు చెందిన ప్రసాద్‌శర్మ అనే పురోహితుడు ఆంజనేయపురంలోని రామాలయంలో అర్చకత్వం చేస్తున్నాడు. ప్రసాద్శర్మకు వారం రోజుల క్రితం కరోనా సోకగా... హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ... చికిత్స తీసుకుంటున్నాడు. శనివారం ఆరోగ్యం మరింత క్షీణించగా... పురోహితుడు తుదిశ్వాస విడిచాడు.
అర్చకుడికి అంత్యక్రియలు నిర్వహించిన అన్నం ఫౌండేషన్ సభ్యులు
అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చే అర్చకుడు శివైక్యమైతే... అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు తన అంతిమయాత్ర నిర్వహించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒడ్డుగూడెంలో జరిగింది.
ఎంతమంది ఆప్తులు ఉన్నప్పటికీ... కొవిడ్ మరణం కావడం వల్ల అంత్యక్రియల కోసం ఎవరూ ముందుకు రాలేదు. వెంటనే అధికారులు ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావును సంప్రదించారు. యాకుబ్ చంటి అనే పౌండేషన్ సభ్యుడు మరో వ్యక్తి సహాయంతో... వేద మంత్రాలతో అందరికీ ఆశీర్వాదాలు పలికిన అర్చకునికి అంత్య క్రియలు పూర్తి చేశారు. అక్కడి నుంచి మరో కొవిడ్ అంత్యక్రియల కోసం అన్నం ఫౌండేషన్ సభ్యులు కృష్ణా జిల్లాకు తరలివెళ్లారు.
గతేడాది జూలైలో ఖమ్మం జిల్లా ఇల్లందులో తొలి కొవిడ్ అంత్యక్రియలు నిర్వహించిన అన్నం ఫౌండేషన్... నాటి నుంచి తమ సేవలను పలు సందర్భాల్లో అందిస్తున్నారు.