భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం హైవేలో... అంజనాపురం గ్రామానికి రోడ్డు పక్కనే ఓ మెకానిక్ షాపు. అందులో లారీ టైర్లు మారుస్తూనో.. వెల్డింగ్ చేస్తూనో.. గాలి పడుతూనే కనిపిస్తోందో మహిళ. ఆమే ఆదిలక్ష్మి. భద్రం-ఆదిలక్ష్మి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. నిరుపేదలైన వారికి నిలువ లేదు. ఉపాధి లేక రోడ్డున పడిన ఆ కుటుంబం కష్టేఫలి అన్నట్టుగా రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. అప్పుచేసి ఓ మెకానిక్ షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. భర్త రోజంతా కష్టపడినా కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మారకపోవడం వల్ల భర్త చేస్తున్న మెకానిక్ వృత్తినే తాను నేర్చుకుంది ఆదిలక్ష్మి.
మొక్కవోని సంకల్పంతో..
సుజాతనగర్సెంటర్లో ఉన్న మెకానిక్ షెడ్డులోనే తాను ఉపాధి మార్గాన్ని వెతుక్కుంది. కొంతకాలం పాటు భర్త చేసే పనిని శ్రద్ధగా గమనించింది. అన్ని పనులు నేర్చుకుని... ఎప్పుడైనా భర్తకు ఆరోగ్యం బాలేనప్పుడు తానే రెంచి పట్టుకునేది. మొదట్లో ఇబ్బంది పడినా... మొక్కవోని సంకల్పంతో ముందుకెళ్లింది. గరిట తిప్పే చేత్తోనే రెంచి పట్టుకోవడం అలవాటు చేసుకుంది. 30 కేజీల బరువు ఉండే లారీ టైర్లను అలవోకగా మార్చేస్తోంది. పంక్చర్లు వేయడం, వెల్డింగ్, డ్రిల్లింగ్ పెట్టడం వంటి పనులు చకచకా చేసేస్తోంది.
ఇప్పుడదే జీవనాధారం