మరికొద్ది రోజుల్లో భద్రాద్రి జిల్లా కేటీపీఎస్‌లోని ఓఅండ్‌ఎం కర్మాగారం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. గడువు తీరిన ఈ కర్మాగారాన్ని పూర్తిగా తొలగించే బాధ్యతను 2019, డిసెంబరులో ‘ఎం జంక్షన్’ అనే సంస్థకు జెన్కో యాజమాన్యం అప్పగించింది. కొన్ని నెలల్లో ఆ సంస్థ తన పనిని ప్రారంభించనుంది. కనీసం ఏడాది వ్యవధిలో సుమారు రూ.300 కోట్ల విలువైన సామగ్రిని కేటీపీఎస్‌కు అప్పగించనుంది. ఎంతో విలువైన ఆ సామగ్రిని కాపాడుకునేందుకు నిఘా విభాగం ముందస్తు చర్యలు ఇప్పటి నుంచే చేపడుతోంది.
కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో వరుస చోరీల నేపథ్యంలో ప్రత్యేక నిఘాపై టీఎస్ జెన్కో యాజమాన్యం దృష్టి సారించింది. ఇక ముందు ఎలాంటి ఘటనలకు తావులేకుండా చూడాలన్న ఆదేశాలతో విజిలెన్స్ ఎస్పీ వినోద్‌కుమార్, ఎస్పీఎఫ్ కమాండెంట్ అన్వర్‌భాషా, కేటీపీఎస్ ఏసీ కోటేశ్వరరావు బృందం కర్మాగారాల్లో ప్రత్యేక పరిశీలన చేపట్టింది. విజిలెన్స్, ఎస్పీఎఫ్ విభాగాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఓ ప్రణాళికను రూపొందించి కార్యాచరణ చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఏడో దశ కర్మాగారంలో ఏడు వాచ్ టవర్లను నిర్మించి ఆయా చోట్ల 21 మంది ఎస్పీఎఫ్ సిబ్బందిని అదనంగా నియమించేందుకు అంతా సిద్ధం చేశారు. ఇదే సమయంలో 5, 6 దశల్లోనూ ఓ వాచ్ టవర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
ఆ కర్మాగారం నుంచి రూ.300 కోట్ల సామగ్రి
ఓఅండ్‌ఎం కర్మాగారాన్ని కూల్చివేత ద్వారా సుమారు రూ.300 కోట్ల విలువైన సామగ్రి బయటకు వస్తుంది. ఈ తరుణంలో ఎవరైనా సామగ్రి చోరీలకు పాల్పడితే కాంప్లెక్స్‌లో నిఘా వైఫల్యం మరోసారి బయటపడడం ఖాయమనే వాదన ఉంది. దీంతో పాటు రూ.కోట్ల విలువైన సొత్తు పరులపాలయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఓ చోట యార్టును ఏర్పాటు చేసి అక్కడ సామగ్రి డంప్ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనిపై గుత్త సంస్థ ఆయా కర్మాగారాల సీఈలు, సివిల్ ఎస్‌ఈలు, ఎస్పీఎఫ్ అధికారులతో కూడా చర్చించింది. ప్రత్యేక యార్డు వద్ద ఎస్పీఎఫ్ పహారా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కర్మాగారం చుట్టూ పర్యవేక్షణ, వాహనాల రాకపోకలకు వసతులు కల్పించారు.