భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యల నడుమ లాక్డౌన్ అమలు జరుగుతోంది. ఇల్లందు పట్టణంలో ఏర్పాటు చేసిన 30 పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే హరిప్రియ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో లభిస్తున్న వైద్య సేవలను పరిశీలించిన ఆమె.. కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యకలాపాలను ఎమ్మెల్యే పరిశీలించారు.
భద్రాచలంలో పకడ్బందీగా లాక్డౌన్ అమలు
కరోనా నివారణ చర్యల్లో భాగంగా భద్రాచలం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. మాస్కులు లేకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులుకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నగరంలోని కూరగాయల మార్కెట్లను మైదానంలోకి తరలించి.. మూడు అడుగుల సామాజిక దూరం ఉండేలా బాక్స్‌లు గీయించారు. కూరగాయలు కొనడానికి వచ్చే వారు ఈ నిబంధనలును పాటించాలని లేని ఎడల శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.